పుట:Andhraveerulupar025903mbp.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాజుల వేడిరక్తముచే బూతమైన పుణ్యప్రదేశములలో రక్కెసకంపలు నిండిపోయినవి. ఆంధ్రరాజుల మహోన్నత దశనుగాంచి యానందించి విజయగీతములు పాడిన కృష్ణాస్రవంతి యిపుడు విపరీతకాల పరిణామమునకు బలవించుచు విషాదగీతికల బాడుచున్నది. ఆంధ్రుల దురదృష్టమువలె బెచ్చు పెరుగు పాటిదిబ్బలలో జారిత్రకరత్నము లెన్ని మరుగు పడియున్నవో సమగ్రమగు పూర్వచరిత్ర మాతృలోకమున కెన్నటికి జ్ఞాపకమునకు వచ్చునో యెవరు చెప్పగలరు?

_______

3. కులోత్తుంగ చోడదేవుడు.

భారతమును నన్నయభట్టారకునిచే ఆంధ్రీకరింప జేసి యంకితముగా గొన్న రాజరాజనరేంద్రుడు మనకు జిరపరిచితుడు. ఈతడు చాళుక్యవంశజుడు. చాళుక్యవంశజులు చంద్రవంశక్షత్రియులని భారతమునందు జెప్పబడెను. ఈనృపుని రాజరాజ విష్ణువర్ధనుడనియు రాజ రాజనియు గూడ వ్యవహరించుట కలదు. తన మేనమామయగు రాజేంద్రచోడుని కుమార్తెయైన అనుంగదేవి నతడు వివాహమాడెను. ఈ దంపతుల కుమారుడే మన కథానాయకుడగు కులోత్తుంగ చోడదేవ చక్రవర్తి.