పుట:Andhra bhasha charitramu part 1.pdf/831

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ములు. (ఇం దుపమానవాచకపద ముత్తరపదముగా నున్నది. ఇట్టివాని నుపమానోత్తరపద కర్మధారయసమాసములనియు, ఉపమితసమాసములనియు గూడ నందురు.) సామాన్యధర్మ ప్రయోగము లేని యెడల నుపమితము వ్యాఘ్రాది శబ్దములతో సమసించు ననుశాస్త్రము ప్రకారము పురుష వ్యాఘ్రుడు, రాజచంద్రుడు మొదలగు సమాసములు సిద్ధించుచున్నవి. తత్సాదృశ్యముచే 'మానిసిపులి, రాచచందురుడు' మొదలగు సమాసములను గల్పింపవచ్చును" అని యహోబలు డనెనుగాని యుద్దిష్టార్థమునకు బాధకము కలుగునప్పు డట్టి సమాసములను చేయగూడదు. మనుష్యుల మీదికి పులివంటివాడు, మనుష్యుల చంపువాడు, అను నర్థమును 'మానిసిపులి' యనుసమాసమువలన ద్యోతకమగుచున్నది గావున శ్రేష్ఠార్థమం దా సమాసము నుపయోగింప గూడదు. రాచచందురుడు మొదలగు సమాసములు తెనుగు నుడికారమునకు దూరములు. ఇట్లే కరకిసలయము, అధరపల్లవము మొదలగు సమాసముల సాదృశ్యము ననుసరించి కైచిగురు, మోవిచివురు, మొదలయినవియు తెనుగు నుడికారమునకు భిన్నములు. పూర్వపదము నర్థమం దుత్తరపదము నర్థధర్మము నారోపించి చెప్పినయెడల రూపకసమాస మందురు. కేలుదమ్మి మొదలయిన విట్టివే.

వండుమోవి, తమ్మికేలు, తీగకాను, తామరమడుగు మొదలయినవి ఉపమానపూర్వపదకర్మధారయ సమాసములు. సంస్కృతమున వ్యాఘ్రశూరుడు, చంద్రసుందరము, సింహవిక్రముడు మొదలగున విట్టివే.

జవ్వాజిసెట్టి, పచ్చళ్లబాపిత, గాజులసెట్టి ఇట్టివి ఉత్తరపదలోపిసమాసములు. (వీనిని మధ్యమపదలోపి సమాసములనుటయు గలదు). ఇట్టి సమాసముల విగ్రహమున బూర్వపదమును ద్వితీయావిభక్తియందు చెప్పి దానిపై లోపించిన పదమును జేర్చి విగ్రహమును బూర్తిచేయవలెను (జవ్వాజిని అమ్ముసెట్టి, పచ్చళ్లను చేయు బాపిత, గాజులను అమ్ముసెట్టి మొద.). (తిక్కన భారతము = తిక్కన (రచించిన) భారతము.)

అఱగన్ను, క్రేగన్ను, సామేను, కొనచేయి, పెడతల మొదలగున వేకదేశిసమాసములు. (ఇవి పూర్వకాయము, అర్ధరాత్రము మొదలగు సంస్కృత సమాసములవంటివి.)

ఠావిమొల్ల, పువ్వునీళ్లు, ఇట్టివి మతుప్సమాసములు (వీనిని గూడ నుత్తరపదలోపిసమాసములని చెప్పుటయే యుక్తము. తావి (గల)మొల్ల, పువ్వు(లుగల) నీళ్లు అని వాని విగ్రహము). 'పువ్వుయొక్క నీరు' అని విగ్రహము చెప్పుచో షష్ఠీతత్పురుషసమాసమగును.