పుట:Andhra bhasha charitramu part 1.pdf/832

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

'పూర్వావరాధరోత్తర మేకదేశి నై కాధికరణే' 'అర్ధమ్ నపుంసకమ్‌' అనునిట్టి పాణినీయ సూత్రముల స్వారస్యము ననుసరించి 'క్రేగన్ను, సామేను' మొదలగు సమాసములు యుక్తములయినను దెనుగున 'కనుక్రేవ, మేనుసగము, పైసగము' మొదలగు నిట్టి యాచ్ఛికసమాసములును దెనుగున గలవు. 'రాజహంస' మొదలగు సాంస్కృతిక సమాసముల ననుసరించి 'ఠాయంచ, రాచిలుక' మొదలగు నాచ్ఛికసమాసములును గలవు.

సమాసములోని రెండుపదములును విశేషణము లయినయెడల దానికి విశేషణోభయపద కర్మధారయమని పేరు. 'పండితుడును గవియునైనవాడు' అను నర్థమున 'పండితకవి' అను సమాసమేర్పడినట్లే ఎత్తును పల్లమునైనది 'ఎత్తుపల్లము' అను నాచ్ఛికసమాస మేర్పడును.

సంస్కృతమున 'ఇతి' అనునదియు, తెనుగున 'అను' అనునదియు పూర్వోత్తర పదములకునడుమ లోపించిన సమాసము సంభావనాపూర్వపద సమాసము: వింధ్యపర్వతము (వింధ్య ఇతి పర్వత:); మఱ్ఱిచెట్టు (మఱ్ఱి అనుచెట్టు) మొదలయినవి.

తపోధనము = తపస్సేధనము - ఇట్టివి అవధారణ పూర్వపదసమాసములు. చెప్పుడుమాట, ఉంపుడులంజ మొదలగున విట్టిసమాసముల కుదాహరణములు కావచ్చును.

కేశాకేశి, దండాదండి, మొదలగు నిట్టి వ్యతిహారలక్షణ బహువ్రీహి సమాసములు తెనుగునను గలవు: హోరాహోరి, ఎకాయెకి మొదలయినవి.

తెనుగున నవ్యయీభావసమాసములకీ క్రింది యుదాహరణముల నీయవచ్చును:-

(1) ఉవ్వెత్తు, కలకాలము, తలక్రిందు, డబ్బాటు, ఉరువడి, బరువడి, వెంబడి - వీనియం దుత్తరపదము అవ్యయ ప్రతిరూపక విశేష్యముగా నున్నది.

(2) ఎల్లుండి, రేపాడి, వీనియం దుత్తరపదము క్త్వార్థకరూపమై విశేష్యార్థమును గలిగించుచున్నది.

(3) ఉండుండి, ఉండియుడిగి, ఇటబట్టి, కాబట్టి, కనుకని, వదంవడి - వీనియం దుత్తరపదము క్త్వార్థకరూపమై యవ్యయముల గల్పించుచున్నవి.

(4) ఇందనుక, ఎడపదడప, క్రచ్చఱ, తెకతేర, - వీనియం దుత్తరపదము తుమున్నర్థకమై యవ్యయములను గల్పించుచున్నది.

(5) ఇంటిల్లిపాది, ఒండొండ, వ్రెబ్బొత్తి, మేమెయి - ఇట్టి సమాసములును గలవు.