పుట:Andhra bhasha charitramu part 1.pdf/827

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చెల్లి, సంయుతాసంయుత ప్రాసమగును. ఈ 'మాంధాత్ర' అను భారత పద్యపాఠమును సమర్థించుటకే పై కారిక పుట్టియుండును.

(49) అచ్ఛిక సమాసములందు సంబంధార్థ షష్ఠీబహువచనమున వచ్చు 'ల' వర్ణమునకు లోపము రాదు: గుణములప్రోక, మాటలప్రోగు, వంటలక్క, తమలపాకులమోద, సకినలమంచము మొదలగువానియందును లవర్ణమునకు లోపము కలుగదు.

ప్రథమావిభక్తిక మువర్ణము తప్ప దక్కిన విభక్తులు సమాసమందు లోపించుననియు, డుజ్, వు, ప్రత్యయాంతములు మీదిపదముతో సమసింపవనియు గొందఱందురు. 'సుబ్బారాయుడు షష్ఠి' అని వ్యవహారమున నుండుట యింతకుముందు సూచింపబడినది. 'నట్టువొజ్జ' అను సమాసము 'నట్టువొజ్జనై మెలగుదు నగళులందు' అను భారతప్రయోగమునందు (విరా. I.) కానవచ్చుచున్నది. ఇందు 'నట్టువ' అనునదే సరియగురూపముగాని 'నట్టువు' కాదని యెవరైనజెప్పి శబ్దరత్నాకరమును జూపవచ్చును. కాని, శబ్దరత్నాకరమున నీ పదము 'వ' వర్ణాంతమేకాని వు వర్ణాంతము కాదనుటకు దగిన ప్రమాణములేదు. సం. నృత్య = ప్రా. ణట్ట = తె. నట్టు(వు), అని యగును. 'నట్టు' అను పదముకూడ నీ యర్థమందే కలదు. 'ధర్మ' శబ్దము 'ధర్మువు' అయినట్లే 'నృత్య' శబ్దము వికృతియందు 'నట్టువు' అగునుగాని 'నట్టువ' అని కాదు. 'ప్రభువునాజ్ఞ' మొదలగు సమాసములందలి వు వర్ణ మాగమాత్మక మైనదనుట వైయాకరణకల్పిత సంస్కారముగాని, యా వువర్ణ మెన్నడును లోపింపనులేదు, మఱల రానులేదు. వు వర్ణము లోపించి మఱల నాగమముగా వచ్చినదనువారు 'ధర్మము తెఱగు' అను సమాసమునందును లోప పునర్దర్శన కార్యములు గలిగినదని యేల చెప్పరో తెలియదు.

సాధారణముగ తెనుగు సమాసములను సంస్కృత సమాసవిధానము ననుసరించి లాక్షణికులు వర్గీకరించుచుందురు. అట్టి వర్గీకరణము కొంతవఱకు మాత్రము పొసగును. సంస్కృత సమాసవిధానమునకు లొంగని యనేక తెనుగు సమాసములను వేఱువర్గములుగ నేర్పఱుపవలసి యుండును. ఈ భావమునే 'ద్విగుకర్మధారయే తత్పురుషద్వంద్వౌ బహువ్రీహి:, అన్యేచ కేచి దుపమానోత్తర పదలోప రూపకాఖ్యాద్యా: పరిదృశ్యా ఇహ' అను నాంధ్ర శబ్దచింతామణి సూత్రము వివరించుచున్నది. కాని, ద్విగుకర్మధారయములు తత్పురుష భేదములై యుండగా వానిని బ్రత్యేకించిచెప్పుట యనావశ్యకమని తోచుచున్నది. కాని యహోబలు డాచ్ఛికసమాసముల నేర్పఱించుపట్ల నిట్టి భేదపరిగణసమావశ్యకమని సమర్థించియున్నాడు. అవ్యయీభావ సమాసము తెనుగున లేదనుభావముతో గావలయు నది చెప్పబడలేదు.