పుట:Andhra bhasha charitramu part 1.pdf/828

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉపమాన సమాసములు, ఉత్తరపదలోప సమాసములు, రూపక సమాసములు అను మూడు కేవలాచ్ఛికసమాసములుగా బైయార్యయందు తెలుపబడినవి. ఇంకను గేవలాచ్ఛిక సమాసము లిట్టి వుండుననియు నా యార్య తెలుపుచున్నది. నన్నయ వివరించిన పై సమాసముల కహోబలుడు చేసిన వ్యాఖ్యాన మాచ్ఛికసమాసములకు సంబంధించినంతమట్టు కీ క్రింద వివరింప బడుచున్నవి.

ముచ్చిచ్చు, మువ్వంక, మువ్వన్నె, ముప్ప్రొద్దు, ముత్త్రోవ, ముక్కాక, ఇరుగడ, ఇరుమేను ఇత్యాదులు ద్విగుసమాసములు. మిశ్రసమాసముకాని ద్విగుసమాసము ప్రాయికముగా నేకవచనాంతమగును; మిశ్రసమాస మైనచో బహువచనాంతమగును; ఈ యేకవచన బహువచనాంతత్వ మితర సమాసములయందును నొకప్పుడు గలుగును. అమిశ్ర ద్విగుసమాసమునకు 'ముచ్చిచ్చు' మొదలగున వుదాహరణములు. (పాదంబు లిరుచేతబట్టి గుంజుండు - కాశీఖండము; ఇరుదెఱగున్న దీప్సితమె - ఆముక్తమాల్యద; ఇరుసెవి యెఱుగక యుండన్ - ఉత్తర హరివంశము; ఇట్టి ప్రయోగము లనేక ములు గలవు.) (ప్రాయోగ్రహణముచే 'ముక్కాకలు', 'ఇరుగడలు' మొదలగు బహువచనాంతద్విగుసమాసములును గలవని తెలియవలెను.) 'నల్గడల జెదరగా' నని నన్నయ ప్రయోగము. మిశ్రసమాసముల కుదాహరణములు: ముజ్జగములు, ముల్లోకములు మొదలయినవి. (ప్రాయోగ్రహణము మిశ్ర సమాసములకును వర్తించునట్లు తోచుచున్నది; ముజ్జగంబేలురాజు, ముల్లోకమున కధిపతి మొదలగునవి.) ఇతర సమాసములందు బహువచనమున కేకవచనము గలుగుట కుదాహరణము: 'తనకూడు సీరకై కాంచనమడిగి' అని తిక్కయజ్వప్రయోగము.

చిగురుటాకు, కఱకుటమ్ము, పండువెన్నెల, నల్లగలువ, తెల్లదమ్మి, తెల్లనితమ్మి, నల్లనివాడు, నల్లనియది - ఇట్టివి కర్మధారయాభావములు. కర్తృత్వము కారకము నాశ్రయించినచో గర్మధారయాభావ మగునని యధర్వాణుడు. 'తెల్లదమ్మి' మొదలగువానియందు బిందువున్నదని (తెల్లదమ్మి, తెల్లందమ్మి) చెప్పు నాధునిక లాక్షణోక్త మప్రామాణికము. (ఈ విషయ మింతకుబూర్వము చర్చింపబడినది.) 'అస్త్యస్తీత్యుదీరిత' అను ప్రయోగానుసారముగ 'కలడు, కలండనెడువాడు' అను సమాస రూపకల్పనము చేయబడినది. 'వలరాచవారు' అను సమాసమున 'పరాశరమునీంద్రుడు' అను సమాసమున 'పరాశరుడు అను మునీంద్రుడు' అను విగ్రహమునందలి ఇత్యర్థకపదము లోపించినట్లే 'వలరాచ అను వారు' అని విగ్రహము చెప్పవలెను.