పుట:Andhra bhasha charitramu part 1.pdf/825

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇట్లు సమాసములందు పూర్వపదములుగ నిలిచిన ధాతుజ విశేషణములపై అట్టి అను పదము వైకల్పికముగా జేరుచుండును: వచ్చుచున్నట్టివాడు, వచ్చినట్టివాడు, వచ్చునట్టివాడు.

(45) నా, నీ, తన అను పదముల కుత్తరపదము పరమగునపుడు దుగాగమము వైకల్పికముగా నగును: నాదుమాట, నీదునేరము, తనదురూపము. ఇట్టి రూపములు కేవలము గ్రంథస్థములు, వ్యవహారమున నిట్టి దుగాగమయుక్తరూపములు వినబడవు. 'యుష్మదదన్మ దాత్మభ్యో ద్వితివర్ణక:' అను నాంధ్రశబ్ద చింతామణి సూత్రము ననుసరించి యందలి బహువచనప్రయోగము నాధారముగా జేసికొని, కొంద ఱాధునికులు 'మనదు, మాదు, మీదు, తమదు' అనురూపములను బ్రయోగించుచున్నారు. కాని యిట్టి రూపములను వైయాకరణ ఛ్ఛాందన కవియగు నప్పకవి (తమదు నడకలు, తమదు పంచమములు) తప్ప బూర్వకవులలో సాధారణముగ నెవ్వరును బ్రయోగించియుండలేదు. వ్యవహారమున నేకవచనము మీదను బహువచనము మీదను దుగాగమము గలిగినరూపములు రెండును నస్వాభావికములు.

(46) గుణవచనములగు నల్ల మొదలగు వానిపై గర్మధారయమున నిగాగమము బహుళముగా నగునని లాక్షణికు లందురుగాని వానిపై జేరిన త్వార్థకమగు 'న' వర్ణముపై మతుబర్థక 'ఇ' వర్ణము చేరినదని చెప్పుట యుక్తమగును: 'నల్ల' విశేషణము; 'నల్లన' భావార్థక తద్ధితరూపము; నల్లన + ఇ = నల్లని = నల్ల దనముగల. ఇట్టి సమాసములందు చేరునది 'ఇ' వర్ణమేకాని 'ని' వర్ణము కాదనుటకు 'తెలిదమ్మి, వెలిదామర, చిన్ని కృష్ణుడు, పెద్దిభట్టు, మొదలగు సమాసములే నిదర్శనము. తెల + ఇ = తెలి; వెల + ఇ = వెలి; చిన్న + ఇ = చిన్ని; పెద్ద + ఇ = పెద్ది. భావార్థమున న వర్ణముచేరిన గుణవాచకపదములు సాధారణముగ నదంతములై యుండును. నల్ల, తెల్ల, వెల్ల, పచ్చ, ఎఱ్ఱ, చామ, తియ్య (తీయ), కమ్మ, పుల్ల, విన్న, తిన్న, నన్న, అల్ల, పల్ల, చల్ల, వెచ్చ, కోల, చక్క, చిక్క ఇవి నల్లాదులు. భావార్థక న వర్ణముచేరని కొన్ని గుణవాచక పదములమీద 'ఇ' వర్ణముమాత్రము చేరును: చిన్ని, తెలి, వెలి, పులి, సంజ్ఞావాచక పదములందుమాత్రము 'పెద్ద' పై 'ఇ' వర్ణముచేరును: పెద్దిభట్టు, పెద్దిరాజు మొదలయినవి. తెల, వెల, పల, చల, పుల ద్విత్వ రహిత రూపములపై ని వర్ణము చేరునుగాని 'తెల్ల, వెల్ల', మొదలగువానిపై చేరదు. 'చిక్క' అనుదానికి 'చిన్న' అను నర్థముగలప్పుడు దానిపై 'ఇ' చేరును: చిక్కిరెడ్డి, నల్లాదులలో గొన్నిటిపై భావార్థమున జేరిన న వర్ణము మీదనే