పుట:Andhra bhasha charitramu part 1.pdf/803

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దిగ్వాచకపదముపై జేరిన 'తీర' శబ్దము 'తార' అనియగును: దక్షిణతీరము. దక్షిణతారము; ఉత్తరతీరము, ఉత్తరతారము.

'దాశ, నాశ, దభ, ధ్యై' అనునవి 'దుర్‌' అను నుపసర్గముపై బరమగునపుడు దాని తుదిరేఫము 'ఉ' గా మాఱును; ఆ పదముల తొలి వర్ణములు మూర్ధన్యములుగా మాఱును: దూడాశము, దూణాశము, దూడభము, దూడయము.

(19) వి, అష్టన్, పంచన్, మణి, భిన్న, ఛిన్న, ఛిద్ర,స్రువ, స్వస్థిక, అనునవి తప్ప మఱి యేపదముమీదనైనను 'కర్ణ' శబ్దముచేరి పశువుల స్వామిత్వమునకు గుఱుతును తెలియజేయు నప్పుడా పదములతుది యచ్చునకు దీర్ఘమగును: ద్విగుణాకర్ణము మొదలయినవి, పశువుల స్వామిత్వము గుఱుతు కానప్పుడు 'శోభనకర్ణము'; ఇట్లే, వికర్ణము, అష్టకర్ణము, పంచకర్ణము, మునికర్ణము, భిన్నకర్ణము, ఛిన్నకర్ణము, ఛిద్రకర్ణము, స్రువకర్ణము, స్వస్తికకర్ణము.

నహ్, వృత్, వృష్, స్వధ్, రుచ్, సహ్, తస్, అనుధాతువులపై 'క్వి' ప్రత్యయము చేరినప్పుడు వానికి బూర్వమందున్న యచ్చునకు దీర్ఘము గలుగును: ఉపానహము, పరీణహము, నీవృతము, ఉపావృతము, ప్రావృట్టు, ఉపావృట్టు, మర్మావిత్తు, హృదయావిత్తు, శ్వావిత్తు, నీరుక్కు, అభీరుక్కు, ఋతీషట్టు, తరీతట్టు మొదలయినవి.

'కోటర' మొదలగు పదములపై 'వన' అనుపదము చేరునప్పుడును, 'కింశులక' మొదలగు పదములపై 'గిరి' అనుపదము చేరునప్పుడును సంజ్ఞావాచకము లేర్పడినచో కోటర కింశులకాది పదముల తుదియచ్చునకు దీర్ఘము కలుగును: కోటరావణము మిశ్రకావణము, సిధ్రకావణము, సారకావణము, పురగావణము; వీనిలో 'వన' శబ్దమందలి 'న' 'ణ' అయినది. కింశులకాగిరి, సాల్వకాగిరి, నడాగిరి, అంజనాగిరి, భంజనాగిరి, లోహితాగిరి, కుక్కుటాగిరి.

'వల' ప్రత్యయపూర్వమగు పదము తుది యచ్చునకును దీర్ఘము కలుగును: కృషీవలుడు.

రెంటికంటె నెక్కువ వర్ణములు గల పదముపై మతుప్‌ప్రత్యయముచేరి సంజ్ఞావాచక మేర్పడునపుడు దాని తుదియచ్చునకు దీర్ఘము వచ్చును, అమరావతి - అజిర, ఖదిర, పులిన, హంస, కారండవ (హంసకారండవ); చక్రవాక, అనుపదములపై మతుప్ప్రత్యయము చేరునప్పుడీ కార్యము కలుగదు: అజిరవతి, ఖదిరవతి మొదలయినవి.