పుట:Andhra bhasha charitramu part 1.pdf/802

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముపై 'దుక్‌' (=ద్) అను నాగమము గలుగును: అన్యదాశీస్సు, అన్యదాశ, అన్యదాస్థ, అన్యదుత్సుకుడు, అన్యదూతి, అన్యత్కారకము, అన్యద్రాగము, అన్యదీయము మొదలయినవి. షష్ఠ్యర్థమున అన్యాశ, అన్యాస్థ మొదలయినవి.

అర్థశబ్దము పరమందున్న 'అన్య' అనుపదము షష్ఠ్యర్థమున లేనప్పుడు దుగాగమము వైకల్పికముగా నగును: అన్యదర్థము, అన్యార్థము.

(18) తత్పురుషసమాసమున అజంతపదము పరమందుగల 'కు' అను దానికి 'కత్‌' అనునదాదేశమగును: కు + అశ్వము = కదశ్వము; కు + అన్నము = కదన్నము. 'త్రయ' అనుపదము పరమందున్నను 'కు' కు 'కత్‌' ఆదేశమగును: కత్త్రయము.

'రథ, వద' అనుపదములకు బూర్వమందున్న 'కు' కును 'కత్‌' ఆదేశమగును' - కద్రథము, కద్వదము.

జాతివాచకమగు 'తృణ' శబ్దము పరమందున్నను 'కు' కు 'కత్‌' ఆదేశమగును: కత్తృణము.

పథిన్, అక్ష, శబ్దములు పరమందున్నచో, 'కు' కు 'కా' ఆదేశమగును: కాపథము, కాక్షము - రెండవపదము 'అక్ష' అనునదైనచో దత్పురుషసమాసమును, 'అక్షి' యైనచో బహువ్రీహిసమాసము నగును.

'కొంచెము' అను నర్థమున సమాసమున బూర్వపదముగానున్న 'కు' కు 'కా' అనున దాదేశమగును: కామధురము, కాలవణము, కామ్లము, కాజలము.

'పురుష' శబ్దము పరమగునపు డీ యాదేశము వైకల్పికముగా నగును: కాపురుషుడు, కుపురుషుడు.

'ఉష్ణ' శబ్దము పరమగునపుడు 'కవ' అను నాదేశము కూడ గలుగును: కవోష్ణము, కోష్ణము.

'పృషోదర' మొదలగుపదములందు లోపాగమాదేశాదులు పూర్వ ఋషుల యుపదేశానుసారముగ సాధువులగును:- పృషత్తు ఉదరముగా గలది 'పృషోదరము'; వారివాహకము = వలాహకము; జీవనముయొక్క మూతము 'జీమూతము; శవముల శయనము 'శ్మశానము' ; దేనికి 'ఖము' ఊర్ధ్వమో అది 'ఉలూఖలము'; 'పేశిని తినునది పిశాచము': 'మహిమీద ధ్వనించునది మయారము:- 'హంస' శబ్దమున వర్ణాగమము (హన్‌ధాతువుపై అచ్ ప్రత్యయముచేరి 'నక్‌' అను నాగమము వచ్చినది; సింహశబ్దమున వర్ణవ్యత్యయము (హింసించునది సింహము), 'గూడోత్మా' అనుదానియందు వర్ణాదేశము; 'పృషోదర' శబ్దమునకు వర్ణలోపము కలిగినది.