పుట:Andhra bhasha charitramu part 1.pdf/756

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క్ష్వేడుడు, గోష్ఠేవటుడు, గోష్ఠేపండితుడు, గోష్ఠేప్రగల్భుడు, కర్ణేటిరటిర, కర్ణేచురచుర = చెవిలో గొనుగువాడు; ఇవి పాత్రేసమితాదులు.

(10) పూర్వకాలమును దెలుపునట్టి పదములును, ఏక, సర్వ, జరత్, పురాణ, నవ = క్రొత్త, కేవల, అనుపదములును విభక్త్యంతములై, అవేవిభక్తులంతమందు గల పదముతో సమసించి సప్తమీతత్పురుష సమాసములగును: ఉదా. స్నాతానులిప్తుడు = మొదటస్నానముచేసి తరువాత అనులేపనము చేసికొన్నవాడు; కృష్ణ సమీకృతము = మొదట దున్ని తరువాత చదునుచేయబడునది; ఏకనాథుడు = ఒక్కనినే యధికారిగా గలవాడు; ఏకభిక్ష = దినమునకొక్కసారి యెత్తినభిక్ష; సర్వమనుష్యులు = అందఱు మనుష్యులు; జరద్ధస్తి = ముసలియేనుగు; పురాణమీమాంసకులు = ప్రాతకాలపు మీమాంసకులు; నవపాఠకులు = క్రొత్తవిద్యార్థులు; కేవలవైయాకరణులు = వ్యాకరణము మాత్రము తెలిసినవారు.

(11) దిగ్వాచక పదములను, సంఖ్యావాచక పదములును, వానితో సంబంధించి యవే విభక్తులయందున్న పదములతో సమసించి, సంజ్ఞావాచకములై తత్పురుషసమాసము లగును: ఉదా. పూర్వేషుకామశమీ = తూర్పుననున్న కామశమి యను పట్టణము; సప్తర్షులు = సప్తర్షులను నక్షత్ర సముదాయము.

(12) తద్ధితార్థముగల విభక్తియందుగాని, సమాసముతో మఱియొక పదము సమసించినప్పుడు గాని, సమాహారార్థమునందుగాని, దిగ్వాచక, సంఖ్యావాచక పదములు, అవే విభక్తు లంతమందుగల పదములతో సమసించి, తత్పురుషసమాసములగును.

(అ) తద్ధితార్థముగల విభక్తి: 'పూర్వస్యాం శాలాయాం భవ:' ఇచట 'భవ:' అనుదానికి తద్ధితార్థముగలిగి 'పౌర్వశాల:' అనురూపము గలిగినది. ఇది తెనుగున మహద్వాచకమగునపుడు 'పౌర్వశాలుడు' అనియు, అమహద్వాచక మగునపుడు 'పౌర్వశాలము' అనియు, రూపముల నొంది తత్పురుష సమాసమగును. ఇట్లే 'అపరశాలుడు, అపరశాలము.'

(ఆ) సమాసముతో మఱియొకపదము సమసించుటకు పూర్వశాలా ప్రియుడు, అపరశాలా ప్రియుడు. ఇట్టి ఉత్తరపద సమాసములు నిత్య సమాసములుగావున వీనికి విగ్రహములేదు.

(ఇ) సమాహారార్థమున దిగ్వాచకములతో సమాసములు కలుగవు; అట్టివి ప్రయోగాసిద్ధములు.