పుట:Andhra bhasha charitramu part 1.pdf/747

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈక్రింది ప్రత్యయములు సమాసముల యర్థము నేవిధముగను మార్పక వాని యంతమున జేరుచుండును:-

అవ్యయీభావమునందు శరత్ప్రభృతులకంటె 'టచ్‌' అను ప్రత్యయము వచ్చును; అనగా వానికంటె 'అ' త్తువచ్చును; అవ్యయీభావసమాసములు నపుంసకలింగము లగుటచేత 'మ్' అనునదియత్తుపై జేరును - శరద్, విపాశ్, అనస్, మనస్, ఉపానహ్, అనడుహ్, దివ్, హిమవత్, హిరుక్, విట్, సద్, దిశ్, దృశ్, విశ్, చతుర్, త్యద్, తద్, యద్, కియత్, జరా (దీనికి 'జరస్‌' అని యాదేశమగును), ప్రత్యక్షమ్, పరోక్షమ్, సమక్షమ్, అన్వక్షమ్, పథిన్, సదృశ్ - ఇవి శరత్ప్రభృతులు. ఉదా. ఉపశరదమ్, ప్రతివిపాశమ్ మొదలయినవి.

సమాసమున అన్ - అంత శబ్దము చేరునపుడు దానియంతమున టచ్ ప్రత్యయము చేరును. అపుడు దాని యంతమందలి 'అన్‌' లోపించును. ఉదా. ఉప + రాజన్ = ఉప + రాజన్ + టచ్ = ఉప + రాజ్ + టచ్ = ఉపరాజ; అవ్యయీభావము కావున 'ఉపరాజమ్‌.' ఇట్లే 'అధ్యాత్మమ్‌' మొదలయినవి.

నపుంసకలింగమగు అన్నంతశబ్దము సమాసమున పరపదమగునపుడు దానిపై 'టచ్చు' వైకల్పికముగా నగును: ఉదా. ఉపచర్మ, ఉపచర్మమ్.

నదీ, పౌర్ణమాసీ, ఆగ్రహాయణీశబ్దము లంతమందుగల యవ్యయీభావ సమాసముల యంతమందు 'టచ్‌' ప్రత్యయము వైకల్పికముగా వచ్చును: ఉదా. ఉపనదమ్, ఉపనది; ఉపపౌర్ణమాసం, ఉపపౌర్ణమాసి; ఉపాగ్రహాయణమ్, ఉపాగ్రహాయణి.

ఝయ్యులు (వర్గప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థాక్షరములు) అంతమందుగల పదములు సమాసము నంతమందువచ్చినను వానిపై 'టచ్చు' వైకల్పికముగా వచ్చును. ఉదా. ఉపసమిధమ్, ఉపసమిత్, మొదలయినవి.

'గిరి' యనుపదము సమాసమున పరమందున్నను దానిపై టచ్చు వైకల్పికముగ జేరును: ఉదా. ఉపగిరఘ్, ఉపగిరి.

పైరీతిగా సంస్కృతమున సిద్ధములయిన యవ్యయీభావసమాసములలో గొన్ని తెనుగుగ్రంథములం దారూపములతోడనే యవతరించినవి. అందు 'అమ్‌' అనునంతముగల సమాసములకు దెనుగున ఉత్తుమాత్రము చేరి ప్రాచీనాంధ్ర కావ్యయములందు తఱచుగ బ్రయోగములు గాన్పించు చున్నవి. తరువాతికాలమున వానిపై 'కన్, కాన్‌'లు చేరుచు వచ్చినవి.