పుట:Andhra bhasha charitramu part 1.pdf/746

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

'దగ్గఱ' అను నర్థముగల 'అను' అనునవ్యయముదేనికి దగ్గఱయో తెలుపు సుబంతముతో వైకల్పికముగా సమసించును: ఉదా. అనువన మశనిర్గత: = పిడుగు వనమునకు దగ్గఱగా పోయెను.

'పొడుగున' అనునర్థముగల 'అను' అను నవ్యయము దేనికిపొడుగుననో తెలుపు సుబంతముతో వైకల్పికముగా సమసించును: ఉదా. అనుగంగం వారాణసీ, గంగాయా అను వారాణసీ = వారాణసి గంగపొడుగునను (ఉన్నది.).

'తిష్ఠద్గు' ప్రభృతు లవ్యయీభావ సమాసములు: తిష్ఠద్గు, వహద్గు, ఆయతీగవమ్, ఖలేయవమ్, ఖలేబుసమ్, లూనయవమ్, లూయమానయవమ్, పూతయవమ్, పూయమానయవమ్, సంహృతయవమ్, సంహ్రియమాణయవమ్, సంహృతబుసమ్, సంహ్రియమాణబుసమ్, సమభూమి, సమపదాతి, నుషమమ్, విషమమ్, దు:షనమ్, ని:షమమ్, అపసమమ్, ఆయతీసమమ్, పాపసమమ్, పుణ్యసమమ్, ప్రాహ్ణమ్, ప్రరథమ్, ప్రమృగఘ్, ప్రదక్షిణఘ్, (అపరదక్షిణఘ్), సంప్రతి, అసంప్రతి, ఇత్యాదులు - తిష్ఠద్గు ప్రభృతులు.

'పార, మధ్య' అనువానికి 'పారే, మధ్యే' యను నవ్యయరూపములగునప్పుడు వానికి షష్ఠీ ప్రత్యయాంత పదములతో సమాసము వైకల్పికముగ గలుగును; వైకల్పికమనుటచేత నివి షష్ఠీతత్పురుష సమాసములుగ గూడ నేర్పడవచ్చును: ఉదా. పారేగంగాత్, గాంగాపారాత్ (ఆనయ); మధ్యే గంగాత్, గంగామధ్యాత్ (ఆనయ).

సంఖ్యావాచకపదము వంశమను నర్థముగల పదముతో వైకల్పికముగా సమసించును. వంశమనగా గురుశిష్య వంశమనికాని, జన్మముచేత గలిగిన వంశమనికాని యర్థము: ఉదా. ద్విముని వ్యాకరణస్య, త్రిముని వ్యాకరణస్య; ఏకవింశతి భారద్వాజమ్, మొదలయినవి.

సంక్యావాచకపదము నదీవాచకశబ్దముతోడను వైకల్పికముగనే సమసించును: ఉదా. సప్తగంగమ్, సప్తగోదావరమ్, ద్వియమునమ్ మొదలయినవి.

నదీవాచక శబ్దములు విభక్త్యింత పదములతో గలిసి, యా పదముల యర్థముకాక యితరార్థము కలిగినప్పుడును నవ్యయీభావ సమాసమేర్పడును: ఉదా. ఉన్మత్తగంగమ్, లోహితగంగమ్, కృష్ణగంగమ్, శనైర్గంగమ్, ఇవియన్నియు దేశములకు సంజ్ఞావాచకములు. ఈ సమాసములకును నందలి పదముల యర్థమునకును సంబంధము లేదు.