పుట:Andhra bhasha charitramu part 1.pdf/748

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


III. తత్పురుష సమాసము.

కొన్ని సమాసములలో గొన్నిటియందలి రెండుపదములలో బూర్వపదము నర్థము ప్రధానముగా నుండును. అట్టిసమాసములకు అవ్యయీభావ సమాసములని పేరు. కొన్నిటియం దుత్తరపదము నర్థము ప్రధానమై యుండును; అట్టివి తత్పురుష సమాసములు. కొన్నిటియందు సమాసమందలి రెండుపదముల యర్థమునుగాక మఱియొక యర్థము ప్రాధాన్యమును పొందును. అట్టివి బహువ్రీహి సమాసములు. కొన్నిటియందు రెండుపదముల యర్థములును సమానప్రాధాన్యమును వహించును; అట్టివి ద్వంద్వసమాసములు.

పై వానిలో నుత్తరపదప్రధానములైన తత్పురుష సమాసములు సమానాధికరణము, వ్యధికరణము నని రెండువిధములుగా నుండును. విశేష్యమును విశేషణమును నొకటితో నొకటి కలిసి సమాసముగ నేర్పడుటకు సమానాధికరణమనిపేరు. ఇట్లు కలియు విశేషణ, విశేష్యములు విగ్రహమునం దేకవిభక్తియం దుండును. ఇట్టి తత్పురుషభేదమునకు గర్మధారయమని పేరు.

వ్యధికరణమనగా వేఱువేఱు (విభక్తుల) నాశ్రయించి యుండుట. ఇట్టి సమాసములందలి పదము లేకవిభక్తికములై యుండవు; వీనిలో బూర్వపదము విశేషణమై యుండదు. ఇట్టిసమాసములు ద్వితీయా తత్పురుషము, తృతీయా తత్పురుషము, చతుర్థీ తత్పురుషము, పంచమీ తత్పురుషము, షష్ఠీ తత్పురుషము, సప్తమీ తత్పురుషము, అని యాఱువిధములుగా నుండును. అభావమును దెలుపు నఞ్ (న) పూర్వపదముగా జేరిన సమాసమునకు నఞ్ సమాస మని పేరు. దీనినిగూడ నఞ్ తత్పురుషమని తత్పురుషభేదముగా బరిగణింతురు.

(అ) వ్యధికరణతత్పురుషము.

I. ద్వితీయాతత్పురుషము.

(1) ద్వితీయా విభక్త్యంతమగు పదము శ్రిత, అతీత, పతిత, గత, అత్యస్త, ప్రాప్త, అపన్న అనుపదములతో సమసించి ద్వితీయా తత్పురుష సమాసమగును. ఈ పదములకు గమీ, గామీ, బుభుక్షు మొదలగు పదములను గూడ జేర్చికొనవలెను: ఉదా. కష్టశ్రితుడు = కష్టము నాశ్రయించినవాడు; కష్టాతీతుడు = కష్టము నతిక్రమించినవాడు మొదలయినవి. ఇట్లే గ్రామగామీ = గ్రామమును (తెనుగు: గ్రామమునకు) ఏగువాడు; అన్న బుభుక్షువు = అన్నమును తిన నిచ్చగించువాడు మొదలయినవి.