పుట:Andhra bhasha charitramu part 1.pdf/732

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గ్రాహ్యమో యగ్రాహ్యమో యను విషయము తేలుచున్నది. ఇట్లు చెప్పుటచే నిచ్చకు వచ్చినరీతి నితరభాషాపదముల మనభాషలోనికి జొప్పింపవలెనని యభిప్రాయము కాదు; గాని యొక యన్యభాషాపదము మనభాషలోనికి జొచ్చి యందఱచేతను నంగీకృత మైనప్పుడు దాని గ్రాహ్యతా గ్రాహ్యతల గూర్చి మఱి చర్చింప నవసరము లేదని దాని సూచన.

మన వైయాకరణులు తొలుతనుండియు దేశ్యాన్యదేశ్యపదవిభాగమును సరిగ జేయరైరి. కేతన 'ఎల్లవారికి దెలిసెడి యాపలుకు లచ్చ తెనుగు' లని 'తల, నెల, వేసవి, గుడి, సుడి, పులి, చలి' యను నుదాహరణములను, దేశి తెనుగుల కుదాహరణముగ, ఎఱుకువ, నెత్తమ్మి, మఱకువ, మచ్చిక, వెన్ను, వీచోపులు అనియును జెప్పెను. ఈ విభాగ మంతసమంజసముగ లేదు. దేశితెనుగు లెల్లవారికి దెలియుననే కాన నచ్చ తెనుగులనుండి వీనిని వేఱుపఱుచుట యేలకో తెలియరాకున్నది. అప్పకవి విభాగ మింతకంటె గొంతబాగుగ నున్నది.

తే. ఆంధ్రదేశపురస్థాయులైన సకల
   జనములకును మఱుంగుదేశంబు లేక
   తేటతెల్లముగా బల్కుమాటలెల్ల,
   నవని శుద్ధాంధ్రదేశ్యంబు లనగ బడును.

ఉదా. పాలు, పెరుగు, నేయి, ఉట్టి, ఱోలు, బిడ్డ, జోలి, అమ్మ, మొదలయినవి.

క. కేశవ యాంధ్రులు నానా, దేశంబులయందు నిలిచి తెలుగువలెతత్త
   ద్దేశోక్తు లంటబలికిన, నాశబ్దము లన్యదేశ్యజాంధ్రము లయ్యెన్.

ఉదా. ఆలము, చివ్వ, కయ్యము, పోరు, బవరము, దురము, దొమ్మి, కలను.

(మనవా రెన్నిరీతుల దెబ్బలాడుచుండిరో. గమనింపుడు.) ఒంటరి, నెల, వేసవి, పల్కులు, వీనులు, తునుక, నెమ్మి మొదలయినవి. కేతన చెప్పిన యచ్చ తెనుగులు దేశితెనుగులు గూడ నప్పకవి చెప్పిన యన్యదేశ్యజాంధ్రములలో గనబడుచున్నవి. మొత్తముమీద నప్పకవి విభాగము కొంత బాగుగ నున్నదని తోపకపోదు. తెలుగువా రితరదేశములకు బోయి యాదేశపు భాషలోని పదములను దమభాషలో జేర్పగా నేర్పడినపదము లన్యదేశ్యజాంధ్రములని యప్పకవి యభిప్రాయము; ఇతరభాషలను మాట్లాడువారు తెనుగుదేశమునకు వచ్చి తెనుగువారితో సంపర్కము గలుగుటవలన నాంధ్రమున జేరిన పదములును నన్యదేశ్యజాంధ్రములనియే చెప్పవలసి యుండును. ఇదిగాక యప్పకవి శుద్ధాంధ్రదేశ్యములకును నచ్చ తెలుగులకును భేదము కల్పించినట్లు తోచుచున్నది. ఎట్లన 'ఆంధ్రదేశ పురస్థాయులైన' అను పద్యముతో నీ క్రిందిదానిని సరిచూచుకోవచ్చును.