పుట:Andhra bhasha charitramu part 1.pdf/730

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అనుబంధము III.

తెనుగు భాషయందలి పదముల సంఖ్యవృద్ధిపొందు మార్గము లనేకములున్నవి. ఉన్నదేశ్యపదములతో సమాసములను గల్పించి క్రొత్త పదముల నేర్పఱుచుకొనుట యొక మార్గము. ఇతరభాషాపదముల నెరవు తెచ్చుకొనుట మఱి యొక మార్గము. ఈ రెండు మార్గములలో గొందఱ కొక మార్గమును గొందఱు వేఱొకటియు బ్రియతరముగ నుండును. సంస్కృత పండితులు తెనుగును దత్సమమయముగ జేయనెంతురు. దేశికవులు దేశిపదముల సమాసములతో గ్రొత్త యూహల దెలుప నెంతురు. సాధారణ జనులకీ కవుల యిష్టానిష్టములతో బనిలేదు. వారి కేపదములు సులభములో యేవి యందుబాటులో నుండునో వానినే వాడుకొందురు. జనవ్యవహారమున దత్సమపదములకు బ్రచారము చాల తక్కువ. గొప్పకవులును దత్సమములను జాలవఱకు బరిహరించుట యందే ప్రీతిని వెల్లడించిరి. సంస్కృతము నెడల వైముఖ్యమును జూపిన వారిలో దమిళులు ముఖ్యులు.

తమిళులునందు సంస్కృత పదము లెంత తక్కువగ నున్న గావ్యమంత యుత్తమ మయినదని లాక్షణికుల యభిప్రాయము. కన్నడమునం "దనుభావామృత" మనుగ్రంథమున: 'మలిద బాళెయహణ్ణినందది, కళెద సిబరిన కబ్బినందది, యటిద ఉష్ణద హాలినందది సులభవాగిపౌన్, లలితవహ కన్నడద నుడియలి, తిళిదు తన్నొళు తన్నమోక్షవ, ఘటిసికొండరె సాలదే సంస్కృతపద లిన్నేను?' అనగా నొలిచిన యరటి పండువలెను, పైతొక్క తీసిన చెఱకు వలెను, చల్లారిన పాలవలెను సులభముగనున్న లలితమగు కన్నడ భాషను దెలిసి తనయందు దానే మోక్షమును సంపాదించు కొన్నచో జాలదే? సంస్కృతము వేఱెకావలెనా? యని కవీశ్వరుడు చెప్పి యున్నాడు. అచ్చ తెనుగు ప్రబంధముల జేసినవారిలో మొదటివాడగు పొన్నిగంటి తెలగన్న-

ఉ. అచ్చతెనుంగుపద్దె మొకటైనను గబ్బములోన నుండినన్.
   హెచ్చని యాడుచుందు రది యెన్నుచు బెద్దలు పొత్తమెల్ల ని
   ట్లచ్చ తెనుంగున న్నొడువ నందుల చంద మెఱుంగువారు ని
   న్మెచ్చరొ యబ్బురం బనరొ, మే లనరో కొనియాడరో నిమన్.

అని యచ్చతెనుంగు నెంతయో కొనియాడి యున్నాడు. మఱియొకకవి.