పుట:Andhra bhasha charitramu part 1.pdf/726

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శైవ నామధేయములు గూడ కొన్ని గలవు. రొద్దం (రౌద్రం), భైరాపురం, భైరవునితిప్ప, బైరసముద్రం, విరుపాపురం, శ్రీకంఠాపురం.గంగాదేవి పేరిట గంగవరం ఉన్నది. బ్రహ్మకు పూజ లేకున్నను నతడు బ్రహ్మదేవిమర్రి, బ్రహ్మసముద్రం, బొమ్మిపర్తి గ్రామనామధేయములలో వ్యక్తమైనాడు.

బసవమతప్రాబల్యమున నేర్పడిన గ్రామముల పేర్లివి:- బసినేపల్లి, బసాపురం, బసవనహళ్ళి. వీరశైవులు, బౌద్ధులతోను, జైనులతోను, బ్రాహ్మణులతోను పోరాడిరిగాని బ్రాహ్మణమతము దానిని గూడ లోగొనుచున్నది.

క్రిస్టియను మతమున కీజిల్లాలో విశేషవ్యాప్తి కలుగలేదు. వారిసంఖ్య 6546. 184 గ్రామములలో వారున్నారు. కాని 101 గ్రామములలో వారిసంఖ్య పదికి మించలేదు. వారు హిందువులతో కలియక ప్రత్యేకముగా నున్నారు. వారి మతముపేరిట ఎట్టిగ్రామమును లేదు. క్రిష్టిపాడు క్రైస్తవ శబ్దమునుంచి వచ్చిన దనవచ్చును గాని దానిని కృష్ణపాడు అనుటయే సరి. ఆయూర 5 గురుమాత్రమే క్రిస్టియను లున్నారు.

కన్నడుల పలుకుబడి ఈ జిల్లాలో చాల కొంచెము. కన్నడపు గ్రామనామములు గూడ కొంచెమే. గడేహోతూరు, బేవినహళ్ళి, బసవనహళ్ళి, బొమ్మకొండహళ్ళి, గూనిమోర్బాగలు, తమ్మడేహళ్ళి, హుళికెరదేవరహళ్ళి, పిల్లనహళ్ళి, నుర్జమ్మనహళ్ళి, తిరుమలదేవరహళ్ళి, ఉప్పరహళ్ళి, వీరబొమ్మనహళ్ళి, దొడఘట్ట, పోలేపల్లివంటిపేళ్లు పోలెయపల్లి అను కన్నడ పదముగా సమర్థించవచ్చునుగాని 'ఎ' అనునది దమపధ్యమునవచ్చు గ్రామములు (ఉదా):- మోడెకుఱ్ఱు. ఆంధ్ర దేశమధ్యమునగూడ గలవు. కొన్ని ఇటీవల మాఱినను గూడ అవి తెనుగుపేరులనుట స్పష్టము. బందార్లహళ్లి, కొటగారిహళ్లి అనువానిలోని బహువచనము గుర్తులగు 'ల' "గారి" అనునవి తెనుగును పట్టి యిచ్చుచున్నవి. ఇవి కన్నడ దేశపు అంచున నుండుటవలన కన్నడు లీమండలమున పూర్తిగా జొరబడలేదనియు సరిహద్దున మాత్రమే యుండిరనియు స్పష్టమగుచున్నది. కాని పంపడు చెప్పినట్లు తన తండ్రికిచ్చిన ధర్మవరము ఇప్పటి తాలూకా పట్టణము ధర్మవర మగునేని పై వాదము నిలువజాలదు. అట్లయినప్పుడు కన్నడులు క్రమముగా నీ మండలమును వదలిపోయిరనికాని కాలక్రమేణ తెనుగుభాష నవలంబించిరనికాని చెప్పవలసివచ్చును. పూర్వమున తెనుగు-కన్నడముల ఉచ్ఛారణ సంప్రదాయ మొక్కటే యగుటచేత స్థలనామములు మార్పులేక అట్లే నిలిచియుండవచ్చును. ఇప్పుడును కన్నడులు రెండు తాలూకాలలో మాత్రమే యున్నారు.