పుట:Andhra bhasha charitramu part 1.pdf/725

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


జక్క (యక్ష), కంబ (స్తంభ), గాండ్ల పదములుగల గ్రామములో నొకప్పడు జైనమత ముండినదని యూహింపవచ్చును. ప్రతితీర్థంకరునికిని రక్షకులుగా ఒక యక్షుడు ఒక యక్షిణియుండిరి. ప్రాచీన జైన దేవాలయములలో పెద్దస్తంభములొకవిశేషము. గాండ్లవారు చాలకాలము జైనులుగా నుండిరి.

తర్వాత సంస్కరణము పొందిన బ్రాహ్మణమతము ఈ మండలమున వ్యాపించినది. బౌద్ధ జైన మతములకు ప్రతిగా నది వ్యాపించి ఆ రెంటిని పారదోలెను గాని ఆ మతములోని ముఖ్య సిద్ధాంతములను మాత్రము అవలంబింపక తప్పినదిగాదు. బ్రాహ్మణుడు తన ఎదుట సర్వమును జయించి దిగ్విజయము చేయుచు అన్ని మతములవారిని తన మతమున కలుపుకొనెను. కాని బ్రాహ్మణులు మాత్రముపలుకుబడియు సంపదభివృద్ధియు కలిగి మనలేదు. వారి సంఖ్యయు అల్పము. రాజులచే కొందఱు బ్రాహ్మణు లగ్రహారములు కొన్నమాట వాస్తవమే కాని వానిలో కొన్ని మాత్రమే ఇప్పుడు వారి స్వాధీనములో నున్నవి.

ఈ మండలములోని మొత్తము 894 గ్రామములలో 267 గ్రామములలో బ్రాహ్మణులు లేరు. 334 గ్రామములలో వారి సంఖ్య పదికంటె హెచ్చుగా లేదు. ఈ జిల్లాలో అన్నికులములవారి కంటె బ్రాహ్మణకులమువారిసంఖ్య తక్కువ. మహమ్మదీయులు కూడ బ్రాహ్మణ సంఖ్యకంటె ఆఱింతలు అదనముగా నున్నారు. జిల్లా మొత్తము జనసంఖ్య 10,50,411. అందులో బ్రాహ్మణులు 18,640 మాత్ర మున్నారు. అనగా నూటికి (1.8) ఇద్దఱకంటే తక్కువ; వేయింటికి 18 మంది. బ్రాహ్మణపదముతో చేరిన గ్రామములీజిల్లాలో 6 గలవు. బ్రాహ్మణయాలేరు, బ్రాహ్మణపల్లి, అనంతపురం తాలూకాలోనున్నవి. ధర్మవరం గుత్తితాలూకాలలో ఒక్కొక్క బ్రాహ్మణపల్లియు, పెనుగొండ తాలూకాలో రెండును అట్టిపేరిటవి గలవు. ఇందులో మూడు గ్రామములలో బ్రాహ్మణులే లేరు. ఒక్కదానిలో 5 మంది మాత్రమే కలరు. 5-వ గ్రామములో 6 మంది బ్రాహ్మణులును 6-వ గ్రామములో ఒక్క బ్రాహ్మణుడు మాత్రమే యున్నారు. ఈ జిల్లాలో బ్రాహ్మణ సంఖ్య క్షీణించి పోవుచున్నది.

గ్రామ నామములను బట్టి తెలియ వచ్చుచున్న హిందూదేవతల పేర్లివి. అహోబలనరసింహ (ఓబలసింగ అని మారినది), కృష్ణ, కేశవ (కాస, కేశా అనిమార్పు), గోవింద, నారాయణ, సీతారామ, సిద్ధరామ, వెంకట, తిరుమల, శ్రీరంగ, వాసుదేవ, హరి, హనుమాన్ లేక తిమ్మ, శ్రీ.