పుట:Andhra bhasha charitramu part 1.pdf/724

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నామకరణ సమయమున బౌద్ధమత మిచట నుండినదని కాదు; దేశములో నామత మెంతవఱకు నాటుకొన్నదో ఇది తెలియపఱుచును. ఇప్పటికిని బుద్ధునిపేరిట, బుడ్డన్న, బొజ్జణ్ణ, బొజ్జయ్య, అను నామకరణములు సాధారణముగా నున్నవి. కుప్ప, కొప్ప, గుప్ప, గుబ్బ,గుమ్మ, దిమ్మె, దిమ్మ, తిప్ప, గుడి, గవి, తోపు పదములుగల గ్రామములు పూర్వము బౌద్ధుల స్థలములని నా విశ్వాసము. ఇచ్చట త్రవ్వకముచేసినచో ఇన్నాళ్లుగా లుప్తమయిన ఈ దేశచరిత్రమును వచించుట కాధారములు దొరకవచ్చును. బౌద్ధభిక్షువులు గవులలో నివసించెడువారు. గవి, కుప్ప, కొప్ప, గుబ్బ, గుమ్మ, ఇవన్నియు సంస్కృతపదమగు గుహనుండి వచ్చిన వికృతులే. బౌద్ధుల చైత్యములు, స్థూపములు, తిప్పలరూపమున నుండినవి. దిన్నె, దిమ్మ, తిప్ప, వీనికన్నింటికిని ఒకటే యర్థము. ఈ దిన్నెలు పురాతనమైనవి. ఈ స్థూపములు గుండ్రముగా నుండును. గుడి అనగా గుండ్రము అని అర్థము.

ఎఱ్ఱగుడియొద్ద అశోకుని శాసనములు లభించుటయు పై యూహను స్థిరపఱుచును. 'స్థూప'మునుండియే తోపువచ్చినది. ఉదా:- ఉత్తర దేశములోని 'సాంచితోప్‌'.

అనంతపురం జిల్లాలోని ఈ క్రిందిగ్రామములు బౌద్ధస్థలములు గావచ్చును:- బూదగని, కొప్పలకొండ, దిమ్మగుడి, ఎఱ్ఱగుడి, బెళుగుప్ప, మద్దిగుబ్బ, బూదిగుమ్మ, భైరవునితిప్ప, అత్తిరాలదిన్నె, అమళ్లదిన్నె, కంబాలదిన్నె, గాండ్లదిన్నె, గార్లదిన్నె, జంబులదిన్నె, జంకర్లేడుదిన్నె, బొందలదిన్నె, మర్రికొమ్మదిన్నె, సజ్జలదిన్నె, బుడ్డేపల్లి.

తర్వాత ఈ మండలమును ఆక్రమించినది జైనమతము. 1931 సెన్ససులెక్కలమేరకు ఇప్పటికిని ఈ జిల్లాలో 1034 జనులున్నారు. వీరు కొలదిమందియేయైనను జిల్లాయందంతట నున్నారు. కాకిగ్రామములో 238 మందియు, అమరాపురం గ్రామములో 125 మందియు నున్నారు. ఇంతమంది మరియితర గ్రామములలో నెక్కడునులేరు. వారు 20 గ్రామములలో నున్నారు. గుత్తి, ధర్మవరం తాలూకాలలో మాత్రములేరు.

జిల్లాలో పలుచోట్ల జైనమత చిహ్నములు గలవు. అమరాపురం, తమ్మందేహల్లి, గుత్తి, కంబదూరు, అగళి, కొనకొండ్ల, పెనుగొండ, రత్నగిరులలో ఈ మతవ్యాప్తికి సాక్ష్యములు కలవు. కంబదూరు గొప్పజైనస్థలము. దానికి తర్వాతిది కొనకొండ్ల. కంబదూరులో జైనదేవాలయమున్నది, కాని ఇప్పుడచ్చోట జైన విగ్రహములు పూజింపబడుచుండలేదు. పెనుగొండలోని రెండు దేవాలయములలో నిప్పుడును జైన మతాచారము ప్రకారము పూజలు జరుగుచున్నవి.