పుట:Andhra bhasha charitramu part 1.pdf/721

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పురమున్నది. గ్రామపు లెక్కలలో శింగనమలచెఱువు శ్రీరంగరాయల చెఱువు అని పిలువబడుచున్నది. వెంకటరాయునిపల్లి, వెంకటాపురము గ్రామములు వెంకటపతిరాయల పేరిటివై యుండును. ఈ కాలమున కొందఱు సేనాధిపతులును, ఇతర ప్రసిద్ధపురుషులుగూడ తమపేరులతో గ్రామ నామకరణము చేయించిరి. దానాయనిచెఱువు, నాగినాయనిచెఱువు, జగరాజుపల్లి, మల్లారెడ్డిపల్లి, కోనేటినాయనిపాళ్యం, తిమ్మానాయనిపాళ్యం, మద్దినాయనిపాళ్యం ఇట్టివే. వీరిలో కోనేటినాయుడు కొంత ప్రసిద్ధుడు.

అతడు 1652 సం. ప్రాంతమున నివసించిన పాళెయగారు. పెనుగొండకోటను బీజాపూరు సుల్తానులకు ఒప్పజెప్పినందుకు లంచముగా నీతనికి కుందుర్పి కోట యియ్యబడెను. కోనేటినాయునిచరిత్రకు సంబంధించిన మెకాంజీ లిఖితమంతయు ఇండియా ఆఫీసునకు గొంపోబడినది. దాని నింతవఱకు నెవ్వరును జదువలేదు.

ఆరవీటి వంశపతనము పిమ్మట ఈ జిల్లా మహారాష్ట్రులయు, ముహమ్మదీయులయు దండయాత్రలకు గుఱియయ్యెను. కొన్ని మహారాష్ట్ర నామములు గ్రామములకు కలిగినవి. మురారీరావు తండ్రి సిద్ధోజీకి హిందూరావని కూడ పేరుండెను. హిందూపురమును అతడే నిర్మించెనట. కాని విజయనగరరాజుల బిరుదావళులలో నంతకుముందే 'హిందూరాయ సురత్రాణ' అను పదము కనబడుచున్నది. తన పేరిట గ్రామనామకరణము చేయుటకు మురారిరాయడు సంకల్పించుకొనలేదు. వానికి శత్రువులతో పోరాడు పనియే ఆజన్మమునుండినది. ఇంకగ్రామనిర్మాణమున కతని కవకాశ మెక్కడిది? అక్కాజమ్మ పేరిటనున్న అక్కాజంపల్లి, అప్పాజీపేట, లోకోజీపల్లి, విఠాపల్లి, ఇవి మహారాష్ట్రుల ఏలుబడికి గుర్తులు. పామిడిలోను, రొద్దంలోను, కొందఱు రంగారీ లుండుటతప్ప మహారాష్ట్రుల రాచఱికపు ఫల మీ మండలమున విశేషముగా కాన్పించదు.

ముహమ్మదీయు లీమండలమును పూర్తిగా జయించిరి. వారు మండలమునం దంతటను వ్యాపించిరి. ముహమ్మదీయ జనసంఖ్యలేని ముఖ్యగ్రామ మొక్కటియులేదు. ఈ మండలమునందలి ఒట్టు 894 గ్రామములలో 86 గ్రామములలో మాత్రమే ముహమ్మదీయులులేరు. బ్రాహ్మణేతరులయు, నిమ్న జాతులయు సంఖ్యతరువాత ముహమ్మదీయులసంఖ్య గొప్పది. ఆర్థికముగా వారిస్థితి ఇప్పు డంతమేలుగ లేకున్నను, వారి పలుకుబడి వృద్ధియగుటకు తగిన పరిస్థితు లేర్పడినవి. ముహమ్మదీయుల పేరిట పదునొకండు గ్రామములు గలవు. అమీన్‌పల్లి, అల్లాపల్లి, ఖైరేవు, భొజ్జేపల్లి, ఖాదరుపేట, తురకపల్లి, ఫకీర్