పుట:Andhra bhasha charitramu part 1.pdf/720

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

త్రలో అనంతసాగరము బుక్కరాయసముద్రము చెఱువులను బుక్కరాజు సామంతుడగు చిక్కప్ప ఒడయరు అను నతడు నిర్మించెనని యున్నది. కాని బుక్కరాయసముద్రములోని ఒకశాసన మీ మంత్రిపేరు అనంతరసు అని చెప్పుచున్నది.

బుక్కరాజునకు అనంతమ్మ యను భార్య ఉన్నట్లు కనబడదు. గంగాదేవి కంపరాయచరిత్రలో నామెపేరు దేపాయిఅనియు, కొన్ని తామ్ర శాసనములలో దేమాంబ యనియు నున్నది. అనంతసాగరమను పేరు నేడు అనంతపురముగా మాఱినది. వీర విరుపణ్ణ బుక్కరాజు కొడుకనియు, అతడు పెనుగొండలో సామంతప్రభువుగా నుండెననియు చెప్పబడినది. విరుపాపురము అనుపేరు అతనివలన వచ్చినదేమో! విజయనగరరాజు లిచ్చిన కొన్ని దాన శాసనములలో ప్రాచీనగ్రామనామములు మాఱ్చి క్రొత్తపేరులు పెట్టబడినవిగాని జనులు ప్రాతపేరులను విడువలేదు. వేములపాడు గ్రామమునకు ఫ్రౌఢదేవరాయపురమనియు, కల్లూరుగ్రామమునకు దేవరాయపురమనియు నామకరణము చేయబడెను. కాని ఈ క్రొత్తపేరులు జనులవాడుకలోలేవు. ఫ్రౌఢదేవరాయని పేరిట నొక్క దేవరాయపురముమాత్ర మున్నది.

కృష్ణదేవరాయనికి ముందట ప్రభువగు నరసనాయకునిపేర నరసాపురమను గ్రామములు అనంతపురము తాలూకాలోను, హిందూపురము తాలూకాలోను, కల్యాణదుర్గము తాలూకాలోను, తాడిపర్తి తాలూకాలోను కలవు. మడకశిరా తాలూకాలోను నరసాంబుధి యనుగ్రామ మున్నది.

అనంతపురము తాలూకాలోని కృష్ణాపురము, పెనుగొండ తాలూకాలోని కృష్ణాపురము, గుత్తి తాలూకాలోని క్రిష్టిపాడు - ఇవి కృష్ణదేవరాయని పేరిట నుదయించిన గ్రామములు గావచ్చును. ఆయన నామధేయము పెట్టిన ఇతర గ్రామములకు క్రొత్తపేరులు నిలువలేదు. కేష్ణరాయని కాలమునాటి బంగారు - తిమ్మరాజు పేరిట నాలుగు తిమ్మాపురములును, ఒక్క నీళ్ళులేని తిమ్మాపురమును గలవు. ఎఱ్ఱతిమ్మరాజుచెరువు గూడ ఈ కాలపునాటి యేప్రముఖుని పేరనో నిర్మింపబడియుండును.

సదాశివరాయని పేరిట ఎట్టి గ్రామములును కనబడవుగాని, అతని ప్రతినిధియగు రామరాజు పేరిట రామగిరి, రామరాజుపల్లి, మూడు రాంపురములును గలవు. తిరుమలదేవరాయపురము తిరుమలదేవరాయనిపేర నున్నది. వెంకటాంపల్లి, వెంగలమ్మచెఱువు, నాగసముద్రము, ఈ గ్రామములు ఆరవీటి వంశములోని రాణుల పేరిటివి: ఆరవీడుగ్రామమే ఇప్పుడు తాడిపర్తి తాలూకాలోని నొక కుగ్రామముగా మాఱినది. శ్రీరంగరాజుపేరిట శ్రీరంగా