పుట:Andhra bhasha charitramu part 1.pdf/722

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


పల్లి, షేక్‌సానిపల్లి, సతార్లపల్లి, సైదాపురము, హుసేన్‌పురము, హుస్సేన్‌పురము, అలంపురము, బీజాపురము, సుల్తాను పేరిటివి. కరీంరెడ్డిపల్లి ముహమ్మదీయుల మతవ్యాప్తిని సూచించును.

ఏ రాజులు వచ్చినను పోయినను, వాస్తవమునకు మండలమును పాలించుచుండినది పాళెయగారులే కావున వారినిగుఱించి తెలిసికొన్నగాని యీ వ్యాసము సమగ్రము కానేరదు. బ్రిటీషువా రీమండలమును ఆక్రమించినప్పుడు ఇక్కడ ఎనుబదిమంది పాళెయగాండ్రుండిరి. అందులో నలుగురుమాత్రమే ప్రసిద్ధులు. అనంతపురము పాలియగారు, నడిమిదొడ్డి పాళెయగారు, వజ్రకరూరియొవద్ద కమ్మలదొడ్డి పాళెయగారు, తరిమెల పాళెయగారు వీరే ప్రసిద్ధులు. ఈ నలుగురును తుదకు జయింపబడిరి. అనంతపురము ఉదిరిపికొండ పాళెయగార్ల చరిత్రము మాత్రమే మనకు మిగిలియున్నది.

అనంతపురము పాళెయగారుని వంశము హండేహనుమప్పనాయునితో ప్రారంభమైనది. జయపురమని పిలువబడు హన్మాపురము బహుశ: అతని పేరిటదై యుండును. ఇతడు రామరాజు కాలమునాటివాడు. ఇమ్మడిహంపానాయుడు అతని కొడుకు. ఇతడు తల్లికోటయుద్ధములో తనువు త్యజించిన మలకప్పనాయుని కొడుకు. కదిరి తాలూకాలోని మలకవేముల ఇతనిపేరిటదేమో? వానికొడుకుహంపానాయుడు. హంపాపురము వానిపేరిటనో వానితాతపేరిటనో వచ్చినది. సిద్దప్పనాయుడు, పవడప్పనాయుడు పై వాని కొడుకును మనుమడును. సిద్దప్ప అను చిన్నకొమారుని విడిచి పవడప్ప మరణించెను. అతని భార్య రామక్క పాళెమును పాలించుకొనుచుండెను. ప్రసన్నప్ప, పవడప్ప, అని సిద్దప్ప కిద్దఱు కుమ్మారులు. ప్రసన్నప్పకు ఉంపుడుకత్తెయగు వసంతమ్మ వలన నలుగురు కొడుకులు గలిగిరి కాని స్వభార్యకు సంతానము లేదు. వసంతమ్మ తనప్రియుని ఖూనీచేసినది. వానితమ్ముడు పవడప్ప పాళెయగా రయ్యెను. పవడప్పకొడుకు సిద్దప్ప పోకిరీ వసంతమ్మకొడుకు రామప్ప తిరుగబడి మురారిరాయుని తనకు సాహాయ్యము కోరెను రామప్ప పాళెయగా రయ్యెను. వాని కొడుకు సిద్దప్ప. సిద్దప్పకు వాని బావమఱది బసప్ప సాహాయ్యముండినది. ఈ బసప్ప నైజామునుండి సిద్దరాంపురమును జాగీరుగా సంపాదించెను. టిప్పుసుల్తాన్ సిద్దప్పనాయుని చెఱబెట్టెనుగాని అతడు విడిపించుకొనెను. మఱల మఱల వీరిని జయించుట యేమని టిప్పుసుల్తాన్ ఈ వంశములోని మగవారినందఱిని ఉరివేసెను. పై జెప్పిన పేర్లుగాక ఈ పాళెయగార్లవలన వచ్చిన గ్రామనామములు సిద్దాపురము, సిద్దరాంపురము, సిద్దరాశ్చెర్ల, ప్రసన్నేపల్లి, బసాపురము అనునవి.

జోగినాయుడు ఉదిరిపికొండకు మొదటి పాళెయగారు. అతని కొడుకు తిమ్మానాయుడు. ఇతనిపేరు తిమ్మనచర్లకు వచ్చినది. వానికొడుకు నరసానాయుడు.