పుట:Andhra bhasha charitramu part 1.pdf/718

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తాలూకాలోని బూదచెర్ల, పురాణకాలపు మనుష్యనివాసముల పేర్లకు కొన్ని యుదాహరణములు. పంచానన మిత్రగారు 'పురాణభారత' మను తమగ్రంథములో బళ్ళారిజిల్లాలోని యీ బూడిదదిబ్బలనుగుఱించి వ్రాయుచు, కప్పగల్లు విషయమై యిట్లు వ్రాసిరి. "ప్రాచీన నాగరకతగల దక్షిణ దేశీయులకును, ఔత్తరాహులకును సంఘర్షణము కలిగినప్పుడు జరిగిన దహనములను, లేదా పెద్దవిడిదలలను ఈ బూడిదరాసులు సూచించును."

బళ్ళారినుండి ధార్వాడ శిలలకుపోవు బాటలో 50 అడుగులు ఎత్తును నాలుగువందల అడుగుల చుట్టుకొలతయుగల పెద్ద భస్మరాశి ఆశ్చర్యమును గొల్పుచు నిప్పటికి నున్నది.

అశోకుని శాసనములు.

రాయదుర్గం తాలూకా సరిహద్దులలో ఇప్పుడు మైసూరికి జెందిన అనంతపురము జిల్లా సరిహద్దు ప్రదేశములో కనబడిన అశోకుని శాసనములు ఈ ప్రాంతమున బౌద్ధమతము వ్యాపించియుండె ననుటకు నిదర్శనము. గుత్తికి ఏడుమైళ్ళ దూరములో ఎర్రగుడివద్ద నాచే బహిరంగపరుపబడిన అశోకుని శాసనములవలన గూడ ఈ మండలము చారిత్రకప్రసిద్ధమైనదని తెలియుచున్నది.

అశోకుని కాలమునుండి క్రీస్తుశకము 7-వ శతాబ్దమున నలరాజులు పాలించినంతవఱకుగల ఈ మండల చారిత్రము మృగ్యమైనది.

గ్రామముల నామకరణములో నలవంశమువారు చేసినపని యేమియో నిశ్చయించుటకు వీలులేదు. అట్టి వంశ మొక్కటి యుండెననునదియు సందేహమే. ఈ వంశముయొక్క రాజులపేర్లు చారిత్రకులకు తెలియదు. అశోకుని తర్వాత ఈ మండలము నేలినరాజులలో నోలంబులు మాత్రమే చరిత్రకు తెలియవచ్చినవారు. వారు గుత్తివఱకు పాలించిరి. వారిపేరిట ఎట్టి గ్రామనామములును లేవు.

గంగవంశమువారి పాలనము తర్వాత రాజవంశనామములు గ్రామములకు వచ్చియుండుటను కనుగొననగును. నొలంబులైనవెనుక గంగవంశమువారే ఈ మండలమునకు రాజులు.

గంగలకుంట, గంగంపల్లి, గంగాదేవిపల్లి, గంగినేనిపల్లి, ఇవి గాంగులచే నుంపబడిన గ్రామనామములని ఊహింపవచ్చును. మరూరు, మరుట్ల అను పేర్లు గాంగ వంశికుడైన మారసింహుని పేరిట వచ్చియుండును. రాజాపురము పేరు ఆ వంశికుడైన రాజరాజనువాని పేరిట నుంచబడియుండును. కాని ఈ గ్రామ మెక్కడనున్నదో ఇప్పుడు స్పష్టము కాదు