పుట:Andhra bhasha charitramu part 1.pdf/715

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

20. పల్లి: ఇది భారతదేశమం దంతట నున్నది. బాంగాలీలో భట్టప్ల.

21. మిట్ట, మెట్ట: కన్నడం: బెట్ట; బంగాలీ: భిట్ట.

22. 12-వ శతాబ్దములోని కేశవసేనుని ఎదిల్‌పూర్ శాసనములో తాలపడా-పాటక అని యున్నది. తాడి - పఱ్ఱు (వాడ); తో పోల్చుడు. సత్రకాద్వి (ద్వి = ద్వీప = తె. దువ్వి, జువి, జువ్వి).

తర్వాత వివిధ గ్రామములకు నామధేయము లెట్లు వచ్చెనో కనుగొందము:-

1. చెట్లు, తీగలు, పొదలనుండి కొన్ని గ్రామములు పేర్లు ఏర్పడినవి. ఈ జిల్లాలో గ్రామములకు పేళ్లనిచ్చిన చెట్లివి. అడ్డ, అత్తి, అర్క (జిల్లేడు) ఆముదము, ఇప్ప, ఈత, చింత, చీకటిమాను, కానుగ, కొండకామెర్ల, గోరంట, చిత్ర, జువ్వి, జంబు, తాడి, తుమ్మ, తంగేడు, తొగర, టేకు, దోస, నారింజ, పుచ్చ, మత్తి, మర్రి, ములక, మేడి, మామిడి, రాగి (రావి), రేణి, వెదురు, వెలగ, వేము, సొరకాయ (హంచి = పరక).

2. చెట్లలోని భాగములనుండి కొన్ని నామధేయములు :- ఆకులు, చిగురు, పూలు, మాను, ముండ్లు. తోపు, తోట అని గూడ కొన్నింటికి పేరు గలవు. అమళ్లదిన్న. అమడుగూరు పదములకు ఆముదముగ్రామమని అర్థమైయుండును. కన్నడము: అమండ = ఆముదపు చెట్టు. లేక వానికి కవల (జోడు) గ్రామములనియైన యర్థము. కొన్ని గ్రామముల పేర్లు ధాన్యనామములనుండి వచ్చినవి. ఉల్లి, కంది, కూరాకులు, కొఱ్ఱ, చామ, జొన్న, సజ్జ, సెనగ, గరిసెలపల్లెకు దానిలోని ధాన్యపుగరిసెనుండి ఆపేరు వచ్చియుండును.

3. ఆయా నేలతీరునుబట్టి కొన్నింటికి పేర్లుకలిగినవి. కరూరు = నల్లమన్ను గ్రామము; కోడూరు = బురదప్రదేశము; చౌళూరు = చౌటినేల; నల్లూరు = నల్లనేల, నీలూరు = నీలిరంగుప్రదేశము, రేగటిపల్లి = రేగడి: ఎఱ్ఱగుడి = ఎఱ్ఱని పల్లప్రదేశము.

4. దిశలను బట్టి కొన్ని పేర్లు: వడుగూరు = ఊత్తరదిశనున్నపల్లి, యాలేరు = ఎల్లగా నున్నగ్రామము, వెలికొండ = బయటికొండ, వెలిదుర్తి = బయటిపల్లి, కొనకొండ్ల = తుదికొండ, లోచెర్ల = చెరువులోనిపల్లె, నడిమిదొడ్డి, తగ్గుపర్తి, దిగువపల్లి, ఎగువపల్లి, మునిమడుగు = మొదటికొలను, తలమర్ల = మొదటి గ్రామము, పిరవలి = కడపటిపల్లె. గ్రామము ఆకారమునుబట్టి కూడ పేర్లు: జుట్టూరు, వంకరకుంట.

5. రాళ్లనుబట్టి పేరులు:- కల్లు, కండ్ల, గుండు, బండ, తుదిగాగల పేర్లన్నియు నిట్టివే.