పుట:Andhra bhasha charitramu part 1.pdf/716

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

6. పెద్ద, చిన్న, ప్రాత, క్రొత్త అను విశేషణములనుబట్టి కొన్నింటికి పేర్లు వచ్చినవి.

7. కొండపేరిట వచ్చినవి: ఉదా. కొండ, మల, మెల, గిరి, అంతమందుగలవి.

8. ఊటలవలన కొన్ని:- మరుట్ల, ఎల్లుట్ల, ఊటకల్లు, దొనేకల్లు, జూలాకాల్వ, ఊటకూరు, ఉబచెర్ల వూబిచెర్ల, వెదురుదొన. వేడినీట యూటలు దోనలుడికి, రావులుడికి.

9. కొలనువలన:- కుంట, కుంట్ల, కులం, కోలం, దొన, మడుగు, వాయి, బెంచి ఈ పేరులు పై వర్గమునకు చేరినవి.

10. కాలువలు:- కాల్వ, జూల, దుళ్ల, కాతి, కాటి, అను పేరిటి గ్రామములు కాలువల మూలమున వచ్చినవి.

11. కోటలు, దేవళములు, తిప్పలు వీని మూలమున కొన్ని.

12. నక్షత్రములపేర్లు:- చుక్కలూరు.

13. పశుపక్ష్యాదులనుండి వచ్చిన పేర్లు:- ఆవు; ఆలూరు; పులి; హులి కుంట; పంది; పందికుంట; ఎనుము: పోతులకుంట - ఎనుములదొడ్డి; పాము: ఉరవకొండ, పాముదుర్తి; ఎలుగు: కరడికొండ; కోడి: కోడికొండ; మిడత: మిడుతూరు; ఈగ: ఈగదూరు; నక్క: నక్కలదొడ్డి; ఎద్దు: ఎద్దులపల్లి; కొంగ: కొంగనపల్లి; నెమలి: నెమళ్లపల్లి; తొండ: తొండపాడు; గుఱ్ఱం: గుఱ్ఱంబైలు.

14. శరీరములోని అంగములపేర్లు:- ముష్టూరు; భిక్షముదొరకు స్థలమనియైన కావచ్చును. జంతలూరు=దంతముల గ్రామము, లేదా వేశ్యలుండు ఊరనియైన గావచ్చును. లేదా యంత్రములు తయారగు ఊరుగా నుండవచ్చును, లేదా దున్నిన గ్రామమని అర్థమియ్యవచ్చును; చూ. జంతపట్టు. దంతగ్రామము అని అర్థము వచ్చుపట్ల బౌద్ధగ్రామమా యనుశంక ఉదయించును. జూటూరు=జుట్టూరు లేదా చుట్టూరు=గుండుగ్రామ మనవచ్చును. లేదా జూటూరు అనగా మోసగాండ్లు నివసించు గ్రామము కావచ్చును.

15. కొన్నింటి పేర్లు బంధుత్వ సంబంధములను బట్టి వచ్చినవి. చిన్న యక్కలూరు (అక్కల వూరు), లేక అర్క అనగా జిల్లేడుపల్లె గావచ్చును.

16. ఆహారవస్తువులనుబట్టి, పప్పూరు, చారుపల్లి.

17. జనుల వృత్తులనుబట్టి వచ్చినవికొన్ని:- గాండ్లదిన్నె, గాండ్లపర్తి, గాండ్లవాండ్లపల్లి, అయ్యవారిపల్లి, ఈడిగవారిపల్లి, ఉప్పరపల్లి, తప్పెట్లవారిపల్లి, తలమర్లవారిపల్లి (మరలు చేయువారిపల్లె), సానిపల్లె, దాదులూరు,