పుట:Andhra bhasha charitramu part 1.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వ్రాయుటకు నాకు జాలకాలమునుండియు గోరిక యుండినది. వ్యావహారికాంధ్రభాషోద్యమ మట్టి చరిత్రను వ్రాయుటకు సహకారియైనది. ఈగ్రంథ మా యుద్యమమున కొక ఫలమని చెప్పవచ్చును. వ్యావహారికభాష నేటివారి వ్రాతలయం దెట్లు వ్యాపించుచున్నదియు దెలుపుట యప్రస్తుతము.

ఆ యుద్యమము నారంభించునపుడు గ్రామ్య లనియు సలాక్షణికములనియు పండితులు నిషేధించు చుండిన శబ్దములకును వ్యాకరణ రూపములకును కవుల గ్రంధముల నుండి ప్రయోగముల నెత్తిచూపవలసి వచ్చినది. దానికొఱకు కృషి యమితముగా జరిగినది. వ్యావహారికాంధ్రభాషా ప్రవర్తకు లట్టి పూర్వకవుల ప్రయోగముల జూపుటయేకాక నేటిగ్రంథకర్తలు తమ గ్రంథములందు నేటి వ్యవహారము నెట్లతిక్రమింప జాలకున్నారో, పూర్వకాలపు భాషతో సరియగు పరిచయము లేకపోవుటచేత పూర్వకావ్యభాష ననుకరింపబోయి యెట్టి భ్రమ ప్రమాదములకు లోనై యెట్టి కృతకభాషను గల్పించి, భాషాభివృద్ధిని తన్మూలమున జ్ఞానాభివృద్ధిని లక్ష్యమునం దుంచుకొనక, యొకరితప్పుల నొకరెంచుకొనుటతోడనే కాలక్షేపము చేయుచున్నారో వివరింపవలసివచ్చినది. ఆ యుద్యమమువలన బూర్వ కాలపుభాషయందు వ్రాయుటవలన నెట్టి ప్రయోజనమును లేదనియు, భాషకు ముఖ్యప్రయోజనమగు నభిప్రాయ ప్రకటనమును, జనులయందెల్ల విద్యావ్యాప్తియు సిద్ధింపవనియు కొందఱికి నచ్చి, వ్యావహారిక భాషయందే గ్రంథములను వ్రాయజొచ్చిరి. వ్యావహారిక భాషావాదుల కృషి మూలమున నేడు క్రొత్తరీతి భాషారచన బయలుదేరినది. ఆరచనలయందు లోపములు లేకపోలేదు. ఆలోపముల నెట్లు సవరించుట యను విషయమును గూర్చి ప్రసంగించుట కిది తావుగాదు.

పూర్వకవుల ప్రయోగములే సాధువులనియు నర్వాచీన కవులప్రయోగములు దుష్టములనియు గ్రాంధికవాదులందురు. కాని, పూర్వకవులభాష స్వరూపము నెవ్వరు నేర్పఱించి యుండలేదు. అట్లేర్పఱుచుటకు బూర్వకావ్యముల నన్నిటిని పూర్వభాషా సంప్రదాయ సూచకములగు పూర్వకాలపు శాసనముల మూలమునను పూర్వకాలపు వ్రాతప్రతులమూలమునను సరిచేసి, వానిలోని భాషను వ్యాకరింపవలయును. ఆంధ్రభాషాచరిత్ర నిర్మాణమునకుబూర్వ మిట్టికృషి యెంతయో జరుగవలసియున్నది. ఇప్పటి ముద్రిత గ్రంధములలో గొన్ని పండిత పరిష్కృతము లయినను నాపరిష్కరణము శాస్త్రీయముగ జరుగలేదు. కావున, నాయా వ్యాకరణ