పుట:Andhra bhasha charitramu part 1.pdf/38

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


పరిశీలనము చేసినగాని నేడెవ్వరును సిద్ధాంతముచేయరు. భాషాశాస్త్రజ్ఞుడు నేడు శబ్దరూపముల నన్నిటిని జేర్చి ప్రతిశబ్దము చరిత్రమును బ్రత్యేకముగ శాస్త్రపద్ధతి ననుసరించి యేర్పఱుచు కొనును" అని చెప్పియున్నాడు. నేటి శాస్త్రజ్ఞు లెన్నో స్వరపరిణామ సూత్రముల నేర్పఱుచుకొని క్రొత్త సిద్ధాంతములను చేయుచున్నారు. నేడు వ్యవహారభ్రష్ట భాషలుకాక, జన వ్యవహారమందున్న జీవద్భాషలు పరిశోధనమునకు గుఱియగుచున్నవి. సంధి, స్వరము, అర్థపరిణామము, మొదలగు ననేకవిషయములను గూర్చి విద్వాంసులు సూక్ష్మచర్చల జేయుచున్నారు.

పాశ్చాత్య విద్వాంసులు భాషాశాస్త్ర విషయమున జేసిన కృషి యమితముగ నున్నది. కాని, ద్రావిడభాషలను గూర్చిన పరిశోధనము చాల తక్కువ యనియే చెప్పవలెను. తమిళభాషను గూర్చి 'పోపు (Pope), మలయాళ భాషనుగూర్చి గండర్టు (Gundert), కన్నడమునుగూర్చి రైసు (Rice), కిట్టెలు (Kittel), తెనుగున బ్రౌను (Brown), మొదలగువా రాదియందు కొంత కృషిచేసియుండిరి. వారి తరువాత నీ ప్రత్యేకభాషల విషయమునను, నీ భాషల పరస్పర సంబంధము విషయమునను, ద్రావిడభాషా వర్గమునకును నితర భాషావర్గములకును గల సంబంధము విషయమునను నెక్కువ కృషి జరుగలేదు. కాల్డువెల్లు 1856 సం. ర ప్రాంతమున వ్రాసిన 'కంపేరెటివ్ గ్రామర్ ఆఫ్ ది డ్రెవిడియన్ లాంగ్వేజస్‌' అను గ్రంథమే ద్రావిడభాషల పరస్పర సంబంధమును గూర్చియు, వానికిని నితర భాషావర్గములకును గల సంబంధమును గూర్చియు, చర్చలుగల గ్రంథముగా నున్నది. దానినే నేటివారు పరమప్రమాణముగా నంగీకరించుచున్నారు. కాని, కాల్డువెల్లు తనకు తమిళముతో మాత్ర మెక్కువ పరిచయము కలదనియు, తక్కిన ద్రావిడ భాషలను బాగుగ నభ్యసించినవారు, తమతమ భాషలను ప్రధానముగ జేసికొని యాలోచించినయెడల వేఱు సిద్ధాంతముల జేయుట కవకాశమున్నదనియు, అట్టి కృషిచేయుటకు దగినవా రీదేశపు పండితులే యనియు, ప్రత్యేక ద్రావిడభాషలనుగూర్చి యెక్కువ కృషి జరిగినగాని యీ విషయమున నిదమిత్థమని చెప్ప వీలులేదనియు తెలిపియుండెను. కాని, యాత డాశించినట్లీ విషయమున దేశీయపండితు లెక్కువ కృషిచేసి యుండలేదు. ఇకముందు ఒకొక్క ద్రావిడభాషయొక్క చరిత్రమును దెలిసికొన బ్రయత్నములు జరుగవలసి యున్నవి.

ఆధునిక భారతీయ భాషలలో బాంగ్లా (Bengali) భాషకు సునీత్ కుమార్ ఛాటర్జీ చరిత్రమును వ్రాసెను. మఱియే భారతీయ భాషకును నట్టి చరిత్రము బయలువెడలినట్లు కాన్పింపదు. ఆంధ్రభాష కట్టి చరిత్రమును