పుట:Andhra bhasha charitramu part 1.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రూపముల వివిధ కాలావస్థలను గూర్చి యిదియే సిద్ధాంతమని చెప్పుట సాహసమే. కాని, యీ గ్రంధమున నాంధ్రభాషాచరిత్ర నిర్మాణమునకు దారితీయ బ్రయత్నించితిని. అందుకు నన్నయ భారతభాగము భాష నానాటి శాసనముల మూలమునను, ఇంచుమించు నూఱు వ్రాత ప్రతుల సహాయమునను నిరూపింప బ్రయత్నించితిని. ఈ గ్రంధమందలి 'పదునొకండవు శతాబ్దమునాటి తెనుగుభాష'యను నధ్యాయ మాకృషికి ఫలము. అటుపిమ్మట ననేకాంధ్ర కావ్యముల భాషయందు గానవచ్చిన వ్యాకరణ విశేషములను సాధ్యమయినంత వఱకును గుర్తించి, వానిని వర్గీకరించి యాయా విషయముల ననుసరించి యేర్పఱిచితిని. నేటికి బ్రకటింపబడిన శాసనముల నన్నిటిని బరిశీలించి యందలి ప్రయోగముల నాయాప్రకరణములందు చేర్చితిని. వ్యావహారికభాష యేయే కాలములందు గ్రంథస్థమగుచు వచ్చినదో నిరూపించితిని. కావ్యములందు చేరని వ్యావహారిక రూపములను నచ్చటచ్చట నుదాహరించితిని. పూర్వ వైయాకరణులు వ్యాకరణ విషయమున జేసిన కృషి నంతటి నుపయోగించికొంటిని. ఆంధ్రభాషకును దక్కిన ద్రావిడ భాషలకును, ద్రావిడభాషా వర్గమునకును నార్య భాషా వర్గమునకును గల సంబంధమును నాకు దోచినట్లు వివరించితిని.

ఈ గ్రంధమున గ్రియాప్రకరణము నవ్యయప్రకరణమును స్థలసంకోచముచే ననుకొన్నంత విస్తరించి వ్రాయుటకు వీలు లేకపోయినది. ఈ రెండు ప్రకరణములందును దెలుపవలసిన విశేషము లనేకములు మిగిలిపోయినవి. గ్రంధపునర్ముద్రణమున వానిని జేర్చెదను. శిశువుల భాష, స్త్రీల భాష, మాండలిక భాషలు, సాంకేతిక రహస్యభాషలు, మొదలగు మఱికొన్ని విషయములను గూర్చియు వివరింపక యాంధ్రభాషాచరిత్రము సంపూర్ణము కాజాలదు. వానిని గూర్చి యీ గ్రంధమున దెలుపుటకు దావులేకపోయినందుకు జింతిల్లుచున్నాను.

ఈ గ్రంధరచనమునందు నా గురువుగారగు మహారాజశ్రీ రావుసాహేబు గిడుగు రామమూర్తి పంతులుగారు వాఙ్మయమునుండి గుర్తించికొని యుండిన యనేక ప్రయోగముల నుపయోగించుకొన్నాను. ఆంధ్రభాషను గూర్చి వారికంటె నెక్కువ కృషిచేసిన వారు లేరు. వారే యీ యాంధ్రభాషా చరిత్రమును వ్రాయ నర్హులు. కాని, వారి జీవితములో ముఖ్యభాగ మంతయు బండితులతోడి వాదములతోను, వ్యావహారికభాషా ప్రవర్త నోద్యమముతోడను గడచిపోయినది. మేమిద్దఱమును నొకచోటనుండి పనిచేయు నవకాశములు లభింపలేదు. అట్టిది సందర్భపడియుండిన, వారి యుపదేశాను