పుట:Andhra bhasha charitramu part 1.pdf/22

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


భావములను ధ్వనులమూలముగా వ్యక్తముచేయును; కాని, భావ ప్రేరితమయిన ధ్వనుల మూలముననే భాషయంతయు నుత్పత్తియయినదని చెప్ప వీలులేదు. ఆ ధ్వను లెంతస్థిరముగా కుదురుకొనియున్నను, మనుష్యుడు తానయి కోరి యాయా ధ్వనుల నాయాయర్థములలో వాడకున్న నది మనుష్య భాష కానేరదు. జంతువులకంటె నొకమెట్టుపైగా నుండి, క్రొత్త శక్తులను సంపాదించుటవలన మనుష్యు డధికుడు కాలేదు. తన సర్వశక్తులను వేఱుమార్గమున నభివృద్ధిపొందించుకొనుటచేత నతని కా యాధిక్యమువచ్చినది. మనుష్యుడు జంతువులకంటె బలములోను, నంత:కరణము (instinct) లోను తక్కువవాడే; అయినను నతని కన్నియెడలను జంతువులకంటె శ్రద్ధ యెక్కువ. అతని సంపూర్ణ మనస్తత్వ మతనిని జంతువులనుండి వేఱుచేయుచున్నది. ఈ మనస్తత్వ మిట్టిదియని విభజించి తెలియజేయ వీలులేదు. మనుష్యుడు తన మనస్సులోనికి సర్వేంద్రియములద్వారా చొరబడు వేదనలలో నుండి యొకదానిని వేఱుచేసి, దానిపై, దానిపై శ్రద్ధనిలుపగలడు. ఒక మేకపిల్లను, చూచి, దానికి ముఖ్యమైన గుఱుతు 'మే' అని యార్చుటయని యేర్పాటుచేసికొని తరువాత మేకపిల్లను చూచునప్పుడు 'మే' అని ధ్వనిచేసి, దాని కాధ్వనినే పేరుగా నతడుకల్పించుకొనును. కనుక మేక 'మే' అని యఱచు జంతు వనునర్థము కలుగును. విశేష్యములు క్రియలనుండి పుట్టును. భాష దైవదత్తమేయైనచో మొదట విశేష్యములును దరువాత క్రియలును పుట్టియుండును. అనేకవిధములయిన భావములు మనస్సులో మెలగి యొకదానిలోని కింకొటి సంక్రమించుచుండును. అందువలన మాటలకు సూక్ష్మమైన యర్థభేదములు కలిగి, యుత్ప్రేక్షలమూలముగా గ్రొత్తశబ్దములు పుట్టుచుండును. ఇందు మూలమున నాకారము కనబడకుండ పులిమిన రంగులుగల యొకపట మేర్పడును. ఇదే తొల్లింటి భాషల స్వభావము. "భాషోత్పత్తికి మనుష్యుని హీన మనస్సంపదయును, వివిధభావము లొకదానిలోని కొకటి, సంక్రమించుటయు గారణము." ఇందువలన నాదిమ భాషలలో పర్యాయపదము లెక్కువగా నుండును. మనోదారిద్ర్యముతోబా టనావశ్యవకపద సమృద్ధికూడ యాదిమ భాషల కొక లక్షణముగా నున్నది.

పైని తెలిపిన యాదిమభాషలు హెర్డరు నుదేశమున బ్రాచ్యభాషలు, వానిలో హీబ్రూభాష ముఖ్యమైనది. హీబ్రూభాషయును, హోమరునాటి గ్రీకుభాషయును, నాదిమభాషకు దగ్గఱగా నున్నవని హెర్డరు నభిప్రాయము. కాని, ఇప్పుడు మన మాదిమభాషోత్పత్తియై నాగరకత యభివృద్ధియగుటకు లక్షలు, కోట్లు, సంవత్సరములు పట్టియుండవలెనని యనుకొనుచున్నాము.