పుట:Andhra bhasha charitramu part 1.pdf/23

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


హెర్డరు తలంచినట్లు భాష హీబ్రూభాషాస్థితికి వచ్చుట కత డూహించిన రెండు, మూడువేల యేండ్ల కాలము చాలదు.

హెర్డరు తన 'భాషోత్పత్తి' అను గ్రంథము మూలముననే భాషాశాస్త్ర జనకుడు కాలేదు. అతడు తన జీవితమంతయు నాశాస్త్ర చర్చలను చేయుచు, నితరులను తన యభిప్రాయమునకు మార్చుకొన్నాడు. సహజమగు పరిణామ మన్నివిషయములలోను కలుగుచున్నదన్న యతని సిద్ధాంతమునే యాధారముగా జేసికొని తరువాతికాలపు :రొమాంటిసిస్టు" లను సాహిత్యపరు లతనిదేశమున నానావిధములైన విషయములను తమ భాషలోనికి పరివర్తనము చేసికొనిరి. వారనేకదేశములవారి, అంతకుపూర్వ ముపేక్షింప బడిన పామరజనుల కవిత్వమును తమ భాషలోనికి భాషాంతరీకరించిరి. మధ్య యుగమునాటి జర్మనువాఙ్మయమును జర్మనుపామరకధలును జాల ముఖ్యములని హెర్డరు తలంచియుండెను. అందుచేత నతడు తరువాతికాలపు గ్రీకు పండితుల కాధ్యాత్మిక గురువని చెప్పవచ్చును. భాషకును మానవజాతి యాదిమ కవిత్వమునకును గల సంబంధము నాతడు గుర్తించెను. మానవజాతి శైశవా నస్థయందలి సంగీతమునకును, తరువాతి కృత్రిమకవిత్వమునకును గల భేదము నాతడు వెల్లడించినాడు. అతనిదృష్టిలో భాషయనునది వాఙ్మయమునకు సాధనము మాత్రము కాదు; భాషయే వాఙ్మయము. భాషయే కవిత్వము. ఒక జాతియొక్క ఆత్మ వా రుపయోగించు మాటలలో వ్యక్తమవును. హెర్డరు తన మాతృభాష నెక్కువగా పొగడుకొన్నాడు. అది గ్రీకుకంటె కొంచెము హీనమయిన దయినను, తక్కిన భాషలకంటె గొప్పది. తన జర్మనుభాషలోని సంయుక్తవ్యంజనములు దానికొక ధీరగమనమును కల్పించును. తన భాష పరుగులువారక, జర్మనీదేశస్థునివలె గంభీరముగా నడచును. తన భాషలోని యచ్చులు వ్యంజనములు కాఠిన్యమును మృదువు పఱుచును; అందులోని యవిరామవ్యంజనములు భాషను శ్రుతిరంజకముగాను, మనోహరముగాను, చేయును. దానిలోని మాత్రలు నిండుగను స్థిరముగాను నుండును; మాటలు ఠీవిగలిగి యుండును. జాతీయములు స్పష్టముగా నుండును. అయినను, అధునాతన జర్మనుభాష లూధరునాటిదానికంటెను, సుఏబియను చక్రవర్తులనాటిదానికంటె నింక నెక్కువగను హీనముగా పరిణమించినది. అందుచేత దానిని పునరుజ్జీవింపజేసి, శక్తిమత్పదభూయిషముగా జేయవలెను. ఇట్టి యభిప్రాయములను ప్రకటించి, హెర్డరు గెటీ యను కవీశ్వరుని, రొమాంటిసిస్టులను తన దృక్పధమునకు మార్చుటయేకాక, పిన్నవారికి ప్రాచీనకావ్యముల శుష్కపఠనమునుండి పరిశోధనమార్గములోనికి దింపినాడు.