పుట:Andhra bhasha charitramu part 1.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాలక్షేపముచేసికో గలిగిన మనుష్యులకు భాషను వాడుకొనవలెనను నక్కఱ యెట్లు కలిగినది? వారి కంతకుముందే యభిప్రాయ ప్రకటనమున కొక సాధనము లేకున్న నీ భావమున కీమాట యని యెట్లే యేర్పాటుచేసికో గలిగినారు? రూసో యభిప్రాయము భాషాచరిత్ర నిర్మాణమునకు ప్రయోజనకారి కాదు.

మాటలురాని స్త్రీ పురుషులు సహజములయిన ధ్వనులతోను నభినయముతోను, బలమైన భావములచేత ప్రేరితులై సహజముగానే యొకరీతి భాషను సంపాదించినారని కాండిలాక్ పండితుని యభిప్రాయము. అట్టి ధ్వనులు సామాన్య భావములకు సంకేతము లవుననియు, క్రొత్త భావము లుదయించిన కొలది నభినయముతో బాటు క్రొత్త ధ్వను లుత్పన్నములయి, మాట్లాడువారు కోరిన వస్తువులను భావములకును గుఱుతు లవుననియు నాతని యభిప్రాయము. ఈ యాదిమ స్త్రీ పురుషులకు గ్రొత్తధ్వనులను పుట్టించు శక్తి యుండకున్నను వారిపిల్లల నాలుక లింకను బాగుగా దిరిగి క్రొత్త ధ్వనులను పుట్టింతురు. ఆ ధ్వనులనుబట్టియు, వారి యభినయమును బట్టియు వారి తలిదంద్రులాక్రొత్తధ్వనుల కర్థముల నూహించి, యాధ్వనులను తాముగూడ జేయుటకు బ్రయత్నింతురు. ఈరీతిగా నంతకంతకు దరములు గడచినకొలదిని క్రొత్త మాటలు పుట్టుచుండును. చాల తరములవారు శ్రమపడి సాధించిన ధ్వనిసముదాయ మొక భాషగా నేర్పడును అని కాండిలాకు నభిప్రాయము.

పదియెనిమిదో శతాబ్దమున నీ భాషాప్రశ్నములనుగుఱించి యెక్కువగా నాలోచించినవాడు జొహన్ గాట్‌ప్రీడ్ హెర్డరు అను విద్వాంసుడు. ఈతడు శాస్త్రీయమైన పరిశోధన మేమియు జేయకపోయినను భాషాశాస్త్రోదయమునకు గారణ మయినాడు. ఆతడు 1772 సం. రమున "భాషోత్పత్తి" అను వ్యాసమును వ్రాసి, దానికి బహుమానమును పొందినాడు. ఆవ్యాసమున నతడు భాష మనుష్యుకల్పితమైనది కాదు; దైవదత్తము, అను నభిప్రాయమును ఖండించినాడు. దేవుడే భాషను నిర్మించి, మనుష్యుని మనస్సులోనికి జొప్పించియున్న, నది యిప్పు డున్నదానికంటె సంపూర్ణముగాను తర్కశాస్త్రానుసారిగాను నుండియుండును. మనుష్యుల భాషలో నిప్పు డెంతో భాగము గందరగోళముగాను, క్రమరహితముగాను నున్నది. అందుచేత నది దైవనిర్మితము కాదు. మనుష్యకల్పితమే. మనుష్యుడు భాషల నిచ్ఛాపూర్వకముగా గూర్చుండి సృష్టింపను లేదు. అది యతని యంత:ప్రకృతినుండి యావశ్యకమగుటచేత నుద్భవించినది. గర్భస్థ శిశువు భూమిపై బడుట కుబలాటము పడునట్లు, భాషకూడ మనస్సులో నుండి బయటికి వచ్చినది. తక్కిన జంతువులవలెనే మనుష్యుడుకూడ దన