పుట:Andhra bhasha charitramu part 1.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తలంచిన శబ్దములు మాత్రమే చేరినవి. ఇప్పటి నిఘంటుకారులవలె వా రాయా భాషలలో దమదృష్టిపధమున బడిన పదముల నన్నిటిని చేర్చియుండ లేదు. అందుచేత నా నిఘంటువులలో నప్పటి వాడుకలోని శబ్దముల యర్థములను వివరింపక వానిని వ్రాసినవా రుండవలసినదని యుద్దేశించిన ప్రకార మర్థములను వివరించుచుండెడివారు.

భాష నిట్లే వాడవలెను అని ఆజ్ఞాపించుటవలన చాల ననర్థములున్నవి. భాషల చారిత్రకపరిణామము, భాషకుసంబంధించిన మానసికశాస్త్రము, వీనిని గుఱించి తెలిసిననాజ్ఞాపించువిధానము పోవును. ఆరీతిగా జేయకున్న సుశబ్దాపశబ్దపరిజ్ఞానము వైయాకరణుల యిచ్ఛాధీనమగును. అందుచేత నొకప్పుడు వాడుకప్రకారము సుశబ్దమయినది నిషేధింపబడవచ్చును. ఒక శబ్దమునకు వైయాకరణులు రూపాంతరమును గూడ నిచ్చినప్పుడు రెండింటికిని లేనిపోని భేదములను కల్పించుచుండెడివారు. ఆభేద మెంత యముఖ్యమయిన దయినను నావ్యాకరణములను చదువుకొనువారు చెమటలుకార్చుకొని వల్లెవేయవలసినదే. ఇట్టి సూక్ష్మభేదములను కల్పించినవారిలో ఫ్రెంచిసాహిత్యపరిషత్తు, వారు ముఖ్యులు; ఇంగ్లాండువారు పరిషత్తును స్థాపించుకొనలేదు; లేనిపోని సూక్ష్మపరీక్షలను చేయను లేదు. వారు తమభాషను సహజముగా పెరుగనిచ్చినారు. అయినను ఇంగ్లీషు బడులలోను, వార్తాపత్రికాలయములలోను నప్పుడప్పుడు సుశబ్దాపశబ్దపరిజ్ఞానమునుగుఱించి సంకుచితాభిప్రాయములు బయలు వెడలుచునే యున్నవి. ఇప్పటికిని నిట్టి యభిప్రాయము లింగ్లాండులోనే యుండగా పదియెనిమిదో శతాబ్దమున నట్టి వున్నవనుట యొక యాశ్చర్యము కాదు.

లాటిను భాషాభ్యాసమువలన దేశభాషలకు గొన్నియెడల గీడు కలిగినది. లాటినుభాషామర్యాదకు విరుద్ధముగా నున్నను దేశభాషలు లాటిను వ్యాకరణసూత్రములనే యనుసరింపవలసియుండెను. మనుష్యుడు స్వభావముచేత పూర్వాచారపరాయణు డగుటచేతను, బడిపంతు లట్టివారిలో నగ్రేసరు డగుటచేతను, భాషలకు సహజాభివృద్ధి కలుగక కొంత నిరోధము కలిగినది.

పదునెనిమిదో శతాబ్దమునాటి గొప్ప వైయాకరణులు భాష సహజముగా ఉత్పత్తి యయినదా, కాదా, అను విషయమునుగుఱించి యెక్కువగా నాలోచించినారు. ఆదిమ మనుష్యు లందఱును నొకచోట జేరి యీవస్తువులకును నీ భావములకును నీ మాటలను వాడుకొందుమని పరస్పరము నేర్పాటుచేసికొన్నారను సిద్ధాంతమును రూసో పండితుడు ప్రతిపాదించినాడు. ఈవాదమునకు బ్రబలమైన యాక్షేపణ లున్నవి. అంతకుబూర్వము భాషలేకుండ