పుట:Andhra bhasha charitramu part 1.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తుడు వానిని తెలియజేసినను తెలిసికొనలేక పోవుటయు నిందుకుదార్కాణము" అని స్వీటు తన 'Handbook of Phonetics' శిక్షాసంగ్రహము అను పుస్తకమున 1877 సం. రములో తెలిపిన అభిప్రాయ మిప్పటికిని వర్తించుచున్నది. ఈరీతిగా జెవికి సంబంధించిన శబ్దశాస్త్రముకంటె కంటికి సంబంధంచిన శబ్దశాస్త్రము ప్రాముఖ్యమును బొందుటకు గారణము లాటిను భాషాభ్యాసమునకు ప్రాధాన్యము నిచ్చుటయే యనిచెప్పుట కెట్టిసందేహమును లేదు.

మధ్యయుగములో లాటినుభాషనే యంతముఖ్యముగా నభ్యసించుటకు గారణము జ్ఞానసంపాదనము నిమిత్తముకాదు; జ్ఞానసంపాదము నిమిత్తమైనయెడల నేదయిన నొక యాఫ్రికాదేశపు భాషనుగాని అమెరికా దేశపుభాషనుగాని పరిశోధింపవచ్చునుగదా. లాటినువలన నేదయిన ప్రయోజనము కలుగునని కాని, అందు మూలమున నాధ్యాత్మిక విజ్ఞానము కలుగుననికాని, యప్పటివా రాభాష నభ్యసింపలేదు. అట్టియభిప్రాయమే యుండిన బూర్వకాలపు లాటినువాఙ్మయమును గాని, తర్వాతికాలపు మత వాఙ్మయమునుగాని యా కాలమువారు పఠించియుందురు. లాటిను ప్రయోజనము పండితు లొకరితోనొకరు మాట్లాడుకొనుటమాత్రమే. లాటినుభాషను కొలదిగానో గొప్పగానో యభ్యసింపని వా డానాటి పండితకోటిలో గాని, చర్చిలోగాని చేరుట కర్హుడు కాకుండెను. అందుచేత వ్యాకరణమనిన శబ్దముల ప్రకృతి ప్రత్యయవిభజనమును చెప్పుశాస్త్రముకాదు. అదియొక కళ. పదముల నామక్రియా విభక్తులను వర్ణించి వానిని సంభాషణలోను, వ్రాతలలోను, నుపయోగించుటయే యాభాషాసంపాదమువలని ప్రయోజనము. 'నీ విట్లే యనవలెను, ఇట్లనకూడదు' అనిమాత్రమే పాఠశాలలో బోధించుచుందిరి. శబ్దములను వల్లెవేయుట, సూత్రములను రుక్కువేయుట, వానిప్రకారము వ్రాయను మాట్లాడను, నేర్చుకొనుట, ఇవే వ్యాకరణముయోక్క యుపయోగములు. భాషావిషయములను స్వయముగా పరిశీలించుట వ్యాకరణమునకు విరుద్ధము. ఇందుమూలమున వ్యాకరణ మాజ్ఞాపించుశాస్త్ర మయినదికాని, భాషా మర్యాదను వర్ణించుశాస్త్రమయినది కాదు. ఈ ప్రకారముగా వ్యాకరణము ప్రయోజనములు సుశబ్దము నుపయోగించుట, యపశబ్దమును పరిహరించుట యనునవి. తరువాతికాలములో దేశభాషలకు వ్యాకరణములు పుట్టినప్పుడుగూడ వాని ప్రయోజనమును నిట్టిదే యయి యుండినది.

శబ్దజాలము విషయమై కూడ నాకాలపువారి దృష్టి యీ మార్గమునే త్రొక్కినది. ఆకాలపు ఫ్రెంచి, ఇటాలియను సాహిత్యపరిషత్తులు ప్రకటించిన నిఘంటువులలో నుత్తమ వాఙ్మయమున వాడుట కర్హమని యా పరిషత్తులు