పుట:Andhra bhasha charitramu part 1.pdf/129

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


నవి. వానికి బ్రత్యేకపదములు చేర్పబడుచు వచ్చినవి. నేటి యార్యభాషలలోను ద్రావిడభాషలలోను గూడ నట్లే జరిగినది.

6. సంస్కృతమునందలి విశేషణములకు విశేష్యములకువలె లింగ విభక్తివచనములనుబట్టి వేర్వేరురూపములు గలుగుచుండును. ద్రావిడభాషలయం దట్లుగాదు.

సమాధానము.

సంస్కృతమునందలి యీ విధానముగూడ బ్రాకృతములందును మార్పుల నొందినది. ఈ విషయమున నేటి యార్యభాషలయందు వైవిధ్యము గాన్పించుచున్నది. సంస్కృతములో విశేషణము వచనమునందును విశేష్యము ననుసరించుచుండ గౌడభాష లన్నిటిలోను ప్రథమేతరవిభక్తి ప్రాతిపదికమే యేక బహువచనములలో నొక్కరూపమున నున్నది. సింధీలో మాత్రము విశేషణముయొక్క స్త్రీలింగ బహువచనము విశేష్యము ననుసరించును. విశేషణములతో జేరు విభక్తిప్రత్యయముల విషయమున గూడ సంస్కృతమునకును నేటి గౌడభాషలకును గొంత భేదమున్నది. విశేష్యముల ప్రధమేతర విభక్త్యేకవచన ప్రాతిపదికము తూర్పు హిందీ, ప్రజభాషలలో 'ఆ', మరారీభాషలో 'యా,'లతో నంతమైయుండగా విశేషణముల 'యా' రూపము 'ఆ' తో నంతమగు చున్నది. ఇంక నిట్టిభేదము లనేకము లున్నవి. ఇట్టి వ్యవహారము గౌడభాషలలో నుండుటకు గారణ మాభాషలలో దీర్ఘాచ్చులతో నంతమగు పదము లుండుటయే. ద్రావిడభాషలలో దీర్ఘములన్నియు హ్రస్వములగుటచే ఏ విధానమం దంతరించినది.

7. ద్రావిడభాషలలో గ్రియాజన్య విశేషణముల నెక్కువగ వాడుదురు. సాధారణ విశేషణముల వాడుక చాల తక్కువ.

సమాధానము.

గౌడభాషలలో గూడ, ముఖ్యముగ బశ్చిమ దక్షిణ గౌడభాషలలో నిట్లే యున్నది.

8. ద్రావిడభాషలలో నుత్తమపురుష బహువచనమున రెండు రూపములున్నవి. అందొకటి మాట్లాడుచున్నవారిని కలిపియు (మనము), మఱి యొకటి మాట్లాడుచున్న వారిని విడిచి పెట్టియు (మేము) ప్రయోగింప బడును. సంస్కృతములో నిట్లులేదు.