పుట:Andhra bhasha charitramu part 1.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సమాధానము.

ఈ విషయమై గ్రియర్‌సన్‌గా రిట్లు చెప్పుచున్నారు. ఉత్తమపురుష బహువచనములో దమిళము, మళయాళము, కురుఖ్, కుఇ, తెలుగు అను ద్రవిడభాషలలోమాత్రము రెండురూపములున్నవి. కురుఖ్, కుఇ, తెలుగు అను భాషలలో నెదుటివారిని విడిచిన రూపమే తమిళ మళయాళములలో వానిని చేర్చునట్టి రూపముగా నున్నది. ఇందువలన మూలద్రావిడభాషలో నుత్తమపురుష బహువచనమున రెండు రూపము లింకను గలుగలేదని యూహింపవలసి యున్నది. కన్నడము, గోండు, బ్రాహూఈ భాషలలో నుత్తమపురుష బహువచనమున నొక్కరూపము మాత్రముండుట యీ యూహను బలపఱుచుచున్నది. కావున నుత్తమ బహువచనమున రెండు రూపము లుండుట మఱియొక భాషాకుటుంబము సంపర్కము వలన గలిగి యుండవలెను. ముండా భాషలయందు బహువచనమున రెండు రూపములున్నవి. ద్రావిడ భాషలయందును రెండురూపము లుండుట యీ ముండా భాషల సంపర్కము మూలముననే యయి యుండును."

ఈ విషయమింకను 'సర్వనామప్రకరణము'న ముందు చర్చింపబడును.

9. ద్రావిడభాషలలో గర్మణిప్రయోగము లేదు. సంస్కృతములో నున్నది. కర్మణిభావము ద్రావిడభాషలలో బ్రత్యేక క్రియలను జేర్చుటవలన దెలుపబడును.

సమాధానము.

నేటి గౌడభాషలలో ద్రావిడభాషల యందువలె కర్మణిప్రయోగము మృగ్యముగా నున్నది.

10. ద్రావిడభాషలలో సముచ్చయార్థమున శత్రర్థకములును, త్వార్థకములును వాడబడును. సంస్కృతములో సముచ్చయచిహ్నము ప్రత్యేకముగ నున్నది.

సమాధానము.

నేటి గౌడభాషలలో ద్రావిడభాషయందువలెనే యున్నది.

11. ద్రావిడభాషలలో నఞర్థక్రియలున్నవి. సంస్కృతములో లేవు.

సమాధానము.

ప్రాకృతములలో నఞర్థకమగు నకారము ధాతువులతో జేరుచు వచ్చినది. నేటి సింధీభాషలో గ్రియారూపములోనే మార్పుగలిగి నఞర్థకము దెలుపబడుచున్నది.