పుట:Andhra bhasha charitramu part 1.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ లింగజ్ఞాన మున్నకొలది యార్యభాషలలోగూడ నెన్నియో తబ్బిబ్బులు గానవచ్చుచున్నవి. ద్రావిడభాషలలో లింగముల యవస్థయు నిట్లే యున్నది. ఆర్యభాషలలో లింగజ్ఞానము మిగిలియున్నంత మట్టుకు ద్రావిడభాషలలో గూడ లేకపోలేదు. శబ్దమును వినినంతనే దాని యంతమునుబట్టి కొన్నిమాటల లింగమును ద్రావిడభాషలలో దెలిసికొనవచ్చును. తెనుగులో తొయ్యలి, వైదలి, కలికి, ముండమోపి, నంగనాచి, మారి, ఆలి, ఉగ్మలి, మొదలగు శబ్దములలోని ఇకారమును, మించుబోడి, వన్నెలాడి మొదలగు శబ్దములలోని ఇప్రత్యయమును, ఎఱుకత, కొఱవత, బోయత, మెలత, చాకిత, మాలెత మొదలగువాని లోని తప్రత్యయమును, పొలతి, పడతి, నాతి, గోతి, మొదలగు వానిలో తిప్రత్యయమును, వెలది, మాలది, మొదలగువానిలోని ది ప్రత్యయమును స్త్రీలింగద్యోతకములుగ నున్నవి. బుడ్డ, బుడ్డి; టింప, టింపి; పిచిక, పిచికి, మొదలగు జంటలలో మొదటిది శబ్దరూపమునుబట్టియే పుంలింగమనియు రెండవది స్త్రీలింగమనియు ద్యోతకమగుచున్నది. ఇట్లే స్త్రీలపేళ్లను హ్రస్వము చేసి పిలుచు నప్పుడు పాపి, సూరి, గురివి, వెంకి, మొదలగురీతుల ఇకారమును స్త్రీలింగ ప్రత్యయముగ వాడుట సర్వసాధారణము. ఇట్లే యితర ద్రావిడ భాషలయందును గలదు.

2, 4. "సంస్కృతములోవలె ద్రావిడభాషలలో విభక్తి ప్రత్యయములు లేవు. విభక్తి ప్రతిరూపకావ్యయములు మాత్రము ప్రాతిపదికములకు జేర్పబడును. ఏకవచనములో విభక్తుల కేప్రత్యయములు చేరునో బహువచనమునందును నవియేచేరును. ఏకవచనమున బ్రాతిపదికమునకును, బహువచనమున బహువచన ప్రత్యయమునకును నివి చేర్పబడును. సంస్కృతములో మూడు వచనములందును మూడు ప్రత్యయములు చేరును."

సమాధానము.

ఈ విషయమై యింతకుముందే కొంత వివరింపబడినది. సంస్కృతములోని విభక్తిప్రత్యయములన్నియు వికారముల నొందుటయు విభక్తిజ్ఞానమంతరించుటయు దిరిగి విభక్తులను బోధించుటకు బ్రత్యేకావ్యయములను బ్రాకృతములోను నేటి యార్యభాషలలోను నుపయోగింప బడుటయు నింతకుముందు తెలిసికొంటిమి. నేటి యార్యభాషలలో సరిగ ద్రావిడభాషల యందువలెనే విభక్తివిధానము కాన్పించుచున్నది. ఒక్క యుదాహరణము చాలును.