పుట:Andhra bhasha charitramu part 1.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సమాధానము.

గ్రంధస్థములుగాని ద్రావిడభాషలనుగూర్చి యెక్కువగా బరిశోధనము జరుగలేదు. వీనిలో సంస్కృతపదము లెక్కువగా లేకుండుటకు గారణము తఱువాతికాలపు ఆర్య విజ్ఞాన మీభాషలను మాట్లాడు జాతులకు జేరకుండుటయే. సంస్కృతపదములుగాక తక్కిన శబ్దజాలమునకును, గ్రంధస్థములయిన భాషలలోని తద్భవ, దేశ్యశబ్దజాలమునకును సంబంధము పరిశోధకులు గుర్తించియే యున్నారు. సంస్కృత ప్రాకృతభవములైన శబ్దములను ద్రావిడభాషలు విడనాడ గలవనుట సరికాదు. గంజి, నీరు, అంబలి, కూడు; గరిటె, తెడ్డు, గిన్నె; కట్టెలు, విసనకఱ్ఱ, మంచము, చాప, గొడ్డలి, కత్తి; ఇల్లు, కొట్టు, అంగడి, అటక; మేక, గొఱ్ఱె, గుఱ్ఱము, గాడిద; అప్ప, అమ్మ, మామ, అత్త, బావ, అక్క:- ఇట్టి వందలకొలది సంస్కృత ప్రాకృతభవములను తెలుగువారు విడనాడ జాలరు.

5. "భాషానిర్మాణము:- శబ్దజాలముమాట యెట్లున్నను భాషానిర్మాణ విషయమున సంస్కృతమునకును ద్రావిడభాషలకును నెట్టి సంబంధమును లేదని చెప్పుచు కాల్డ్వెలు ఈక్రింది విషయములను వివరించి యున్నాడు.

1. "సంస్కృతములోని లింగమునకును ద్రావిడభాషలలోని లింగమునకును సంబంధమేలేదు. సంస్కృతములో లింగము శబ్దముల యంతములను బట్టియుండును. ద్రావిడభాషలలో నిది సహజలింగము. ఇందు శబ్దముల యంతములతో బనిలేదు."

సమాధానము.

సంస్కృతములోగూడ సంపూర్ణముగ శబ్దముల యంతముల ననుసరించి లింగమేర్పడునని తలంపవీలులేదు. అకారాంత శబ్దములలో దారా: వంటి శబ్దములు కొన్ని పుంలింగములు. ఇకారాంతములలో పుంలింగములును స్త్రీలింగములును గూడ గలవు. అ, ఇ, ఉ, ఋ, లు అంతమందుగల శబ్దములు మూడు లింగములందును గలవు. ఇట్లే హలంతశబ్దము లందుగూడ నొక నిర్ణయములేదు. కాని శబ్దముల లింగము ననుసరించి వానితో జేరు విభక్తి ప్రత్యయములు మాఱుచుండు ననుట నిజము. ప్రాకృతభాషలలో శబ్దముల యంతములు వివిధముగ మార్పుల నొందుటచే నేశబ్ద మేలింగమో నిర్ణయించుట కవకాసము లేకపోయినది. రానురాను నేటి యార్యభాషలయందు గొన్నిటిలో దప్ప శబ్దములనుబట్టి తెలియదగిన లింగజ్ఞాన మంతరించినది.