పుట:Andhra bhasha charitramu part 1.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దగినదంతయు - మొదటినుండియు సంస్కృతమునకును ద్రావిడభాషలకును వేర్వేరుగనున్నది."

సమాధానము.

సర్వనామములు సంస్కృతమునకును బ్రాకృతములకును సమానమూలమగు నిండో-ఐరేనియను భాషలనుండి వేర్వేరు మార్గముల బరిణామముల నొందివచ్చి యుండుటచే భేదముగలిగినది. సంఖ్యావాచకముల విషయమున నిండో యూరోపియను భాషలందును నేటి యార్యభాషల యందును జాలపోలికలను జూపవచ్చును. వీనినిగూర్చిన ప్రశంస మఱియొకచోట జేయబడును. సుప్తిజ్ ప్రత్యయములు ప్రాకృత భాషలోనే లోపించినవి. విభక్తి రూపములన్నియు సామాన్యముగ నేకరూపమును దాల్చుటచే నావిభక్తి సంబంధమును దెలుపుటకు గ్రొత్తమాటలు చేర్పబడుచు వచ్చినవి. ఈమార్పు ద్రావిడ భాషల యందువలె దక్కిననేటి యార్య భాషలయన్నిటి యందును గాననగుచున్నది. వాక్యనిర్మాణవిషయమున సంస్కృతమునందు పదప్రత్యయ సంయోజనము సంపూర్ణముగ నుండుటచే వాక్యము లోని శబ్దముల స్థానము విషయమున నొకనియతిలేకుండెను. కాని ప్రాకృత భాషలయందును వాని పరిణామ రూపములగు నేటి భారతీయ భాషలయందును బ్రత్యయములు లోపించుటచే వాక్యములోని శబ్దములస్థానము విషయమున నొకనిర్ణయ మేర్పడ వలసివచ్చెను.

3. "ద్రావిడనిఘంటువులలో సంస్కృత పదజాలమెక్కువగ నున్నదని ద్రావిడభాషలు సంస్కృత భాషాజన్యములని తలంపగూడదు. ఆనిఘంటువులలో దేశభాషాపండితులు దేశ్యములను బ్రత్యేకించియే యున్నారు."

సమాధానము.

శబ్దజాలమును తత్సమ, తద్భవ, దేశ్య, భాగములుగా విభజించుట ద్రావిడ భాషలలోనే కాక ప్రాకృతము లందును నున్నది. తత్సమములనునవి సంస్కృతమునుండి క్రొత్తగా నెరవు తెచ్చుకొన్నట్టివి. అవి నిత్యజీవనమున సమస్తజనులకు సమస్త విషయములందును నుపయోగపడు నట్టివి కావు. అవి మతము, విజ్ఞానము, శాస్త్రములకు సంబంధించినవి. కావున నవి సాధారణ జనులనోటిలో బడి చివికిపోక నిలచియున్నవి. తక్కిన ప్రాకృతములనుండి వచ్చిన శబ్దజాలములో గొంత మార్పుచెందక యట్లేనిలచినది. కాని సాధా