పుట:Andhra bhasha charitramu part 1.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కించుచున్నారు. వా రట్లు చెప్పుటకుబ్రాచీన ప్రాకృతభాషలు ప్రచారమునం దున్నకాలమునకే ద్రావిడభాషలు నేటిరూపమునగాని తత్తుల్యమైన రూపమునగాని యుండెనని నిరూపింపవలసి యున్నది. ప్రాచీనప్రాకృత భాషల కాలమునకు నేటిరూపమున ద్రావిడభాష లుండెననిచూపుట కెట్టి నిదర్శనములు లేవు. ఆనాడు దక్షిణదేశపు భాషలకు దాక్షిణాత్య యను పేరుండెను. మృచ్ఛకటికమున చందనకుడు పలికిన "కణ్ణాడకలహప్పఓఅం కరేమి" అనువాక్యము దాక్షిణాత్యభాష కుదాహరణముగ గనపడుచున్నది. మార్కండేయు డీభాషలకు లక్షణా కరణత్వమును దెలిపి దానిని ర్చివివరింపలేదు. ఈ భాష శౌరసేనీభవమైన యావంతికి సంబంధించినట్లు లాక్షణికులు తెలుపుచున్నారు. ఇదిగాక దక్షిణదేశభాషలయందలి ప్రాకృతములలో ద్రావిడప్రాకృత మొకటి యుపభాషగా దెలుపబడి యున్నది. దాక్షిణాత్యయను ప్రాకృతమును ద్రావిడీప్రాకృతమును పైశాచీ భాషావికారములని కొందఱి యభిప్రాయము. ఎట్లైనను నీవిషయమై ప్రాకృత లాక్షిణికులుగాని ద్రావిడభాషలకు వ్యాకరణముల వ్రాసిన వైయాకరణులు గాని ద్రావిడభాషల ప్రాకృతత్వమునుగూర్చి విచారింపలేదు. ఇండియా దేశపుభాషలలో లిఖితరూపమున నున్నవానిలో సంస్కృతముతఱువాత ప్రాకృతములు మొదటివి. ఆ తఱువాత లిఖితములయినభాషలు ద్రావిడభాషలు: తమిళములో 5 లేక 6 వ శతాబ్దమునుండియు గ్రంథములుకాన్పించుచున్నవి. అంతకు బూర్వమే యా భాషయందు గ్రంథము లున్నవని కొందఱందురు గాని తగిన నిదర్శనములు లేకపోవుటచే నాయూహ నేడు విడనాడ బడుచున్నది. తమిళము తఱువాత లిఖితమైనభాష కన్నడము (7 వ శతాబ్దము.) తఱువాత లిఖితమైనది తెనుగు (9 వ శతాబ్దము.) తక్కిన భారతవర్షీయ భాషలన్నియు బదునొకండవ శతాబ్దమున కీవల గ్రంధస్థములైనవే. వానిలో బశ్చిమహిందీభాషాభాషాభేదములగు బుందేలీ (12 వ శతాబ్దము); బ్రజ్ భాష (1192); మరాఠీ (13 వ శతాభ్దముమధ్యమము); మళయాళము (13 లేక 14 వ శతాబ్దము); బంగాళీ (14 వ శతాబ్దము); కాశ్మీరి (14 వ శతాభ్దము); పంజాబీ (15 వ శతాబ్దము); గుజరాతి (15 వ శతాబ్దము); మైథిలీ (15 వ శతాబ్దము); అస్సామి, అవధీ లేక కోసలీ (16 వ శతాబ్దము); బఘేలీ (1563); ఒఱియా (17 వ శతాభ్దము); ఖస్కుర లేక నేపాళీ (17 వ శతాబ్దము); కనౌజీ (17 వ శతాబ్దము); సింధీ (18 వ శతాబ్దము); కుమౌనీ (1790); గఱ్ఱ్వాలీ (1876); ఆయా భాషలలో నాయాకాలములందు ప్రథమగ్రంథములు వెలువడినట్లు తెలియవచ్చుచున్నది. అంతకు బూర్వము వానిస్వరూప మెట్లుండెనో తెలిసికొనుట