పుట:AndhraRachaitaluVol1.djvu/98

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ఈయనకు మహాకవిగా రావలసినపేరు హరికథకుడుగా వచ్చినది. హరికథా కథనములో వీరికి జెప్ప దగిన శిష్యులు నేతి లక్ష్మినారాయణ, వాజపేయయాజాల సుబ్బయ్య, చొప్పల్లి సూర్యనారాయణ మున్నుగా బెక్కురున్నారు, వారెల్ల గురువుల స్మరణకు దెచ్చు హరికథాకేసరులు. నారాయణదాసుగారు ఆడువారు మగవారు కలిసి గజ్జెకట్టు మరాఠీ హరికథా విధానమును మార్చి మన దేశపద్ధతిలో గ్రొత్తమెఱుగులు కలిగించినారు. ఆయన త్యాగరాజువంటి భక్తుడు. సరిగా, త్యాగరాజు జయంతి నాడే దాసుగారు పరమపదము చేరుట మరచిపోరాని ఘట్టము. అదియటుండ, ఈయన జీవితము తిరుపతి వేంకటకవుల జీవితముతో గొంత పోలియుండుట మనము గమనింతుము. కవిత్వముపేరు చెప్పుకొని వారు ప్రతిసంస్థానము, ప్రతిగ్రామము చూచినారు. హరికథల పేరుచెప్పుకొని నారాయణదాసు చూడని సంస్థానము, చూడని పురములేదు. చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రిగారికి నేడు కవిత్వము చెప్పువాడెల్ల శిష్యుడు. నారాయణదాసుగారికి నేడు గజ్జె కట్టినవాడెల్ల శిష్యుడు. ఈయిరువురికి సాక్షాచ్చిష్యులో, పరంపరాశిష్యులో, ఏకలవ్య శిష్యులో కానివారు తెలుగువారిలో నెందఱుందురు? చెళ్ళపిళ్ళకవిని స్మరింపక శతావధానము, నారాయణదాసును స్మరింపక హరికథా లే దన్నట్లుగా నున్నది. నారాయణదాసు పండితులలో బండితుడు, కవులలో గవి. గాయకులలో గాయకుడు. ఆయన నేటి సాధారణదాసులవలె మాటలు, పాటలు నోటబట్టుకొని చెప్పవలసిన ప్రారబ్ధయోగము కలవాడు గాడు. అశువులో నప్పటి కప్పుడు చెప్పుటయే యాయన యలవాటు. పరవాదులతో భాషించునపుడు, అంత నిర్బీతి, అంత స్వపక్షస్థాపనప్రీతి కలవారరుదుగానుందురు. నారాయణదాసు జీవితము మదపుటేనుగు మనుగడ. ఆ భోగ త్యాగములు వేఱొకనికి సాగుట కష్టము.