పుట:AndhraRachaitaluVol1.djvu/97

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యైన జయంతి కామేశము గారిని తలపోసికొనవలసియున్నది. ఆయన బరంపురం నివాసి. దాసుగారి తొట్టతొలిహరికథకు సన్మానముచేసి, ప్రోత్సహించిన మహోదారుడాయన. అదియాది, మైసూరు సంస్థానములోనేకాక, పిఠాపురము, ఉర్లాము, చీకటికోట, కిర్లమపూడి, మందసా, సిరిపురము, లక్షీనరసాపురము, సంగెడిగూడెము, నూజవీడు, వేంకటగిరి మున్నుగా నెన్నో దేశ సంస్థానములలో వీరి కఖండ సత్కృతులు జరిగినవి. మైసూరు సంస్థానమునకు వీరువెళ్ళినప్పటి ముచ్చట చెప్పవలసియున్నది. నారాయణదాసుగారి అన్నగారు సంగీతజ్ణలు ఈయన యభివృద్ధికి గొంతకారణ మాయన్నగారేయని కొందరు చెప్పుకొందురు. ఆయన గాత్రము సన్నవిడిది. నారాయణదాసుగారిది చెప్పనక్కరలేదు. బ్రహ్మాండమంతగొంతు. తమ్మునివెనుక నన్నగారు సహకారగానము చేయుచుండు నలవాటు. మైసూరు వీరిరువురును వెళ్ళిరి. సంస్థాన విద్వాంసుల పరీక్షల కాగినగాని ప్రభుదర్శనము కాదు. మొత్తముమీద బెక్కునాళ్ళకు దివాణములోని గాయకులు వీరిపాట వినుట కేర్పాటు చేసిరి. కొమ్ములుతిరిగిన పండితులు కూర్చుండి, నారాయణదాసుగారిని, వీణవాయించుటకును, వారియన్నగారిని పాటపాడుటకును నియమించిరి. ఇది బొత్తిగా రక్తి కట్టలేదు. అపుడు దాసుగారు "తానుపాడెదనని, అన్నగారు వీణవాయించు" నని చెప్పి గొంతెత్తెను. ఇక బట్టబగ్గములులేవు. కొంతదూరములో బచారు చేయుచున్న మహారాజు చెవిలో నమృతవర్తి వలె నారాయణదాసుగారి కంఠస్వరము చొఱబడినది. ఆశ్చర్యపడి, ఆయన తిన్నగావచ్చి స్వయముగా దాసుగారి విషయమడిగి తెలిసికొని యభినందించి బహుమానించెను. అది దాసుగారికి మైసూరు గాయకుల యెదుట, పండితుల యెదుట నొక జయధ్వజ ప్రతిష్ట. మైసూరు వృత్తాంతము పత్రికలలో జదివి విజయనగరము మహారాజు ఆనందగజపతి నారాయణదాసును గుర్తించి, కానిపించుకొని సంస్థాన విద్వాంసునిగా జేసెను.