పుట:AndhraRachaitaluVol1.djvu/67

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

విలాసములోని కవితారీతు లీ సుబ్రహ్మణ్యకవి కొన్ని సంగ్రహించెను. అందలిపద్యములు పద్యములుగా గొన్ని యిందున్నవి. కథలో గూడ బెద్ద మార్పులేదు. భావములు చాలవఱకు దానిని బోలినవే. ఈవిషయము శ్రీ నడకుదుటి వీరరాజుగారును వెల్లడించిరి. ఆకవి కవితపైగల యభిమానమున నీసుబ్రహ్మణ్యకవి యిటులు చేసినాడని సమర్థించు కొనవలయును. పురాణపండ మల్లయ్యశాస్త్రిగారి వ్యాఖ్యతో 1912 లో నీగ్రంథము నేటి పీఠికాపుర ప్రభువు లావిష్కరించిరి. సుబ్రహ్మణ్యకవి సాధారణకవి కాడనుట కతనిగూర్చినకథలు చాలగలవు. పెద్దపెద్ద సంస్థానములకు బోయి యతడుచూపిన విచిత్రాశుకవితాదు లందులకు దార్కాణ. ఆయన 'చాటు ధారాచమత్కారసార' మనునొక గ్రంథము సంధానించెను. అందు సంస్కృతమున జాటువులుగ నుండి పండితులచే బరంపరాయాతములై యున్న గంభీరార్థకములగు శ్లోకములకు సులభమైన యర్థము వ్రాయబడియున్నది. ప్రాచీనాధునాతనపద్యము లెన్నో యందున్నవి.

కమలాకర కమలాకర
కమలాకర కమల కమల కమలాకరమై
కమలాకర కమలాకర
కమలాకరమైనకొలను గని రా సుదతుల్.

ఈపద్య మిచ్చి మాడుగుల సంస్థానములో నెవరో పండితులు సుబ్రహ్మణ్యశాస్త్రిగారి నర్థము చెప్పుమనిరట. నాటి వారిలో నిట్టి పాషాణములను బ్రద్దలుగొట్టు దిట్టలు చాలమంది యుండువారు. మన శాస్త్రీగారు వెంటనే దానికర్థము వివరించిచెప్పిరి. తరువాత సేకరించిన కొన్ని చాటువులకు వ్యాఖ్య వ్రాసి "చాటుధారా చమత్కారసారము" వెలువరించిరి.

జయంతి రామయ్యపంతులుగారికి వీరికిని మైత్రి. రామయ్యపంతులుగారి ప్రోత్సహమువలన నీకృతి రచితమైనది. ఆ విషయమును నిస్పష్టముచేయు శ్లోక మీక్రిందిది విధిగా నుదాహరింపదగినది.