పుట:AndhraRachaitaluVol1.djvu/565

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

పలుకుబడి బింకమైనది. ప్రాతమాటలకు క్రొత్తపూతపూయు కూర్పు నేర్పు చౌదరిగారి కెన్నడో యలవడినది. ధర్మనిష్ఠకు నదవిష్ఠమైన యితివృత్తము లాయన యేరుకొన గలవారు. ఉభయ భాషలయందును చక్కని సాహిత్యము. సంస్కృతాంధ్ర శబ్దముల బరువులు, మురువులు పట్టిచూచు, తూచి పద్యములలో సంధానింప గలుగుటలో సీతారామమూర్తికవీ చేయితిరిగిన చతురుడు. సుశిక్షితులైన కవులు నేటివారిలో బలుచబడుచున్నా రన్నమాట కొందరికి కోపకారణము కారాదు. చౌదరిగారివలె ధారాళముగా గవిత కట్టువారు లేరనికాదు. ఈ సౌభాగ్యమునకు దోడు సౌష్ఠవము కూడ నుండవలయును. దానికి, సంస్కృతాంధ్ర కావ్య పరిజ్ఞానమేకాక, వ్యాకరణ ప్రవేశముకూడ విధిగా నుండవలసినది. ఈయుభయము మన సీతారామమూర్తి చౌదరి గారిలో నున్నవి. ఈ యస్తిత్వము చూచుకొని పండితకవులును వీరిని గౌరవించుచున్నారు. విద్వత్కవులగు తాడేపల్లి వేంకటప్పయ్యశాస్త్రి గారితో గాళిదాసత్రయము చౌదరిగారు పాఠముచేసిరి. ఆయన యాచార్యకము వీరి భావిజీవితమున కొక మేలిదారి నగపరిచిన దనవచ్చును. ఈ కృతజ్ఞత చౌదరిగారిలో నున్నది.

ఏకశ్లోక రహస్య బోధనముచే నెవ్వాడు శిష్యున్ సుధీ
లోకాగ్రేసరు జేయు నవ్విబుధు గొల్తున్ వెంకటప్పార్యు న
స్తోక శ్లోక మయూఖరాజదఖిలాశున్ రామగాథామృతా
ఖ్యాక గ్రంథమతల్లికా జనకు మద్గైర్వాణ భాషాగురున్.

1930 లో వీరు ఉభయభాషాప్రవీణ పరీక్షలో నుత్తీర్ణత నందినారు. చిట్టిగూడూరు పాఠశాలలో వీరికి గురుత్వము నెరపిన శ్రీ దువ్వూరి వేంకటరమణ శాస్త్రిగారిని గూర్చి ' ఆత్మకథ ' లో నిటులు స్తుతి చేయుచున్నారు.