పుట:AndhraRachaitaluVol1.djvu/566

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"శబ్దశాస్త్రాది లక్షణ సంప్రదాయ

మెవ్వ డెఱిగించె నాకు సయ్యిద్ధ చరితు

బ్రస్తుతించెద బుంభావ పద్మజాత

రమణి దువ్వూరి వేంకటరమణ శాస్త్రి"

ఈ యుదాహరణము లెందు కనగా, సీతారామ మూర్తిచౌదరి గారు గాలిచదువు చదివిన వారుగాక గురుకుల క్లిష్టులై శాబ్దాదుల యందు గృత పరిశ్రమ లనుటకు-వాస్తవమునకు, వారియేపద్యము పట్టినను, ఈవిషయము వెల్లడి యగును. "ఉభయతోముఖ గవాయుత దాన ఫలదాత్రి"-దేశభక్తి పదవీ నదవీయసి" "తచ్చ్రవణ సాహితి దుశ్శక మెట్టివారికిన్"-"పుంపవు రీడ్యమాన" "శ్రద్దధానుడు"-:రామాభిధానపు న్నిర యార్చీరంగ"-ఇత్యాదులైన రహస్యములు శిక్షితునకుగాని తెలియనివి. ఇట్టివి చౌదరిగారు కృతులలో వందలు వాడినారు. అట్లని, కేవల ప్రయోగ వ్యామోహము కలవారే యనుకొనరాదు. రసదృష్టిలో జూచినను వారి రచనలకు మంచి స్థానమున్నది. శయ్యా సౌందర్యము మంచిది. భావనము గంభీరమైనది. ఆవేశమును ప్రశంసనీయమైనది. పోకడలు ధర్మనిష్ఠానిష్ఠితము లయినవి. ఇక వారి ధోరణి యెటు లుండును? అందులో, నిండుగా దెలుగు దనమును వలచిన రచయితలు చౌదరిగారు. పరభాషా-వేష సంస్కార సంపర్కములు బొత్తిగా నీయనకు నచ్చవు. జాతీయ మైన పరమ ధర్మము నీయన దివ్యమంత్రముగా నుపాసించుచున్నారు. ఆయన రాష్ట్రగానాదులు దీనికి దారకాణగా నిలబడురచనలు. క్షేత్రజీవులు, ఆదర్శజీవులు, శిథిలక్షేత్రములు-ఇవన్నియు చౌదరిగారి కవితా వాహినీ పూరములో బరిపూతములగు వస్తువులు.