పుట:AndhraRachaitaluVol1.djvu/564

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

తుమ్మల సీతారామమూర్తి చౌదరి

1901

కమ్మవంశీయులు. తల్లి: చెంచమ్మ. తండ్రి: నారయ్య. జన్మస్థానము: గుంటూరు మండలములోని కావూరు. జననము: 25-12-1901. రచనలు: 1.ఆత్మకథ 2. రాష్ట్రగానము 3. ఆత్మార్పణము 4. ధర్మజ్యోతి. 5. అమరజ్యోతి 6. పరిగపంట. 7. పెద్ద కాపు (కావ్యములు) 8. మహేంద్రజననము (నాటకము) 9. రామలింగేశ్వర శతకము 10. రామశతకము 11. గాంధీ తారావళి - మున్నగునవి.

తెలుగువారి కవితా శాఖలో నిరువదవ శతాబ్దివచ్చి వసంతరేఖలు దిద్దినది. ఈ శతాబ్ది యవతారముతోపాటు జన్మించిన కవి తుమ్మల సీతారామమూర్తి చౌదరి. ఆయన కృతులు ఆంధ్రరాష్ట్రమున గానము చేయ బడుచున్నవి. వారి "రాష్ట్రగానము" పేరు విననివా రుండరు. సీతారామమూర్తి చౌదరిగారు మహాత్ముని "ఆత్మకథ" కావ్యరూపముగా సంతరించిరి. అది సుప్రసిద్ధము. ఆయన ధర్మజ్యోతి, అమరజ్యోతి, పరిగపంట పెద్దకాపు ఇత్యాదులు యువరసికులకు నిత్యపారాయణమున నున్న కృతులు.

పుర్రెకొక్క బుద్ధి పుట్టు జిహ్వకు నొక్క
రుచి జనించు నంట రూడియైన
సరసులెల్ల మెచ్చ మెరయింతు గైతలో
గమ్మ దనము మత్కులమ్మున వలె.

ఇది చౌదరిగారి నియమము. ఈ నియమము తప్పకుండ కమ్మని కవిత గల కూర్పులు మనకెన్నో వా రందిచ్చిరి. తొల్లింటి కవుల ధర్మములు వీసమెత్తు కాదనుటకు వీ రిష్టపడరు. రసభావ పరిపుష్టమైన రచనావైదగ్ధ్య మాయనలో వలసినంత యున్నది. భాష నిర్దుష్టము.