'బాగుబాగు' కామేశ్వరరావుగారు తొట్టతొలుతగా వ్రాసిన 'ఆట' దానిరచనాకాలము 1923 సం. అదికళాశాలవిద్యార్థుల కోరికపై వ్రాయబడ్డది. ఈ 'ఆట' నాటికి, నేటికి సుప్రచారప్రశస్తుల నందుచునేయున్నది. మొదటిరచన కీరితి ప్రసిద్ధివచ్చుట యెక్కడనో కాని యుండదు. కామేశ్వరరావుగారి "ఆట" లన్నియు బ్రదర్శితములగుట శ్లాఘనీయము.
ఉత్తమ హాస్యరచయిత తత్త్వావధారణమునకు మార్గదర్శి యనుకొంటిమి. ఇట్టి దర్శకత్వము 'భమిడిపాటి' వారిలో నున్నది. ఉదాహరణమునకు 'అద్దెకొంపలు' రచన యొక్కటి చూతుము.
ఇంచుమించుగా నిరువది పుటలు అద్దెకొంపలనుగూర్చి సామాన్యధోరణిలో వ్రాసి వ్రాసి చిట్టచివర ఈ దిగువ పంక్తులు సంధానించిరి:
"...అద్దెలధోరణిబట్టిచూస్తే బౌతికలోకంయొక్క అస్థిరత్వం స్ఫురణకొస్తుంది. కొంపలేకాదు ఊళ్లూ, జిల్లాలు, ఈఇండియా, ఈప్రపంచము ఇవన్నీకూడా అద్దెవ్యాపారాలే కదా అనిపిస్తుంది! రోగంవల్లో, బెడదచేతో, అవాంతరం మూలాన్నో, కూనీ ద్వారానో, ఆత్మహత్య రూపంగానో, దారిద్ర్యం ధర్మమా అనో ఏదో తరవాత తరవాత మాత్రమే మానవులకి గోచరించే కారణాన్ని పురస్కరించుకుని జీవుడు శరీరం ఖాళీచేసి పోతూండడం ఆరగారగా చూడగా ఎవడిమట్టుకువాడికే తెలిసేదాన్నిబట్టి-జీవుడికి శరీరాలు అద్దెకొంపలు."
పయినున్న యావద్రచనకును, దిగువనున్న యీపదిపంక్తులు జీవము పోసినవి. ప్రాణమువంటి యీ 'పేరా' లేనిచో 'అద్దెకొంపలు' వ్యాసము సర్వము శరీరముగదా! నిస్సారమైన యీ వస్తువును హాస్యరసస్ఫూర్తితో జిత్రించుటలో గల విశేషముకంటె, దానిని తత్త్వసరణిని సమన్వయపఱచుటలో జూపిన విశేషము ప్రశంసాభాజనమని నేను భావించెదను. ఇది యొకటి కాదు, కామేశ్వరరావుగారి రచనలలో