పుట:AndhraRachaitaluVol1.djvu/553

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇట్లే కామేశ్వరరావుగారి ప్రదర్శనములు, ఉపన్యాసములు, కథలు బహిరంతర్హాస్యరసవాహినులు. ఆయన రచనల పేళ్లు, వానిలోని వ్యక్తులపేళ్లు కూడా వింత పుట్టించునవి. కచటతపలు-వద్దంటేపెళ్లి-ధుమాలమ్మ ఓఘాయిత్యం-శానయ్య-మరకమ్మ-చిక్కేశ్వరరావు-ఈ నామకరణములు మఱి యెటువంటివి? శ్రీ కామేశ్వరరావుగారి రచనలో కొన్నిపట్టులు, చెవినిబడిన కొంతసేపువఱకు నవ్వుపుట్టింపక, చర్వణమయిన తరువాత గడుపు చెక్కలు చేయును. నాయుద్దేశమున 'భమిడిపాటి' వారి హాస్యములో ఉత్తానమైన వాచ్యతకంటె, ఉదాత్తమైన వ్యంగ్యమర్యాదపాలు హెచ్చుగా నుండుననియే. ఒక ప్రసిద్ధవిమర్శకుడు లక్ష్మీనరసింహముగారి హాస్యమునకును వీరేశలింగముగారి హాస్యమునకును భేద మున్నదని చెప్పుచు నిట్లు తేల్చెను: "వీరేశలింగముగారి హాస్యము చిక్కనిది. లక్ష్మీనరసింహముగారి హాస్యము పలుచనిది. లక్ష్మీనరసింహముగారి హాస్యము గిలిగింతలు పెట్టి నవ్వించును. వీరేశలింగముగారి హాస్యము గిల్లి బాధించును" అని. రచయితకు ప్రజాప్రబోధదృష్టి నిండుగా నుండునపుడు, వాని రచనలు వాచ్యార్థమువైపునకు ములునూపుట తప్పదు. వీరేశలింగము పంతులు సాంఘికముగా సంస్కారపు మెఱుగులు సరితీర్పవలసిన సుప్రచారకుడు 'చిలకమర్తికవి' కూర్పుతీరులు కోరినంతగా, వీరేశలింగముపంతులువలె ప్రబోధదృష్టి పరిపుష్టముగా గలిగి యున్నవాడు కాడేమో? అందుకే, ఆ యుభయుల హాస్యరచనలకు నిట్టియంతర మేర్పడినది.

ఇపుడు మన కామేశ్వరరావుగారు కూడ ప్రబోధదృష్టిని మించిన కళాదృష్టి కలవారని నేను నిశ్చయించుకొన్నాను. వీరు అనువదించిన 'మోలియర్‌' ప్రదర్శనములు, స్వతంత్రించి వ్రాసిన ప్రదర్శనములు, మొత్తముమీద సొంతరచనల వలెనే యుండుట మెచ్చదగిన విషయము అనుసరణమును గూడ స్వతంత్రముగానే తీర్చగల చాతుర్య మాయన కలములో నున్నది.