పుట:AndhraRachaitaluVol1.djvu/542

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

జేయుదురు. సాంసారికమైన ముచ్చటలు, సాంఘికమైన యాచారములు ప్రదర్శించుటలో శాస్త్రిగారిది యందివేసినచేయి. వైదికకుటుంబములలోని నడతలు వీరికథా ప్రపంచమున నచ్చుగ్రుద్దినట్లు కానుపించును. 'వడ్లగింజలు - మార్గదర్శి - కన్యా కలే యత్నాద్వరితా' - ఇత్యాదులయిన వీరికథలు రసవాహినులు. ప్రేమపాశం, నిగళబంధనం, రాజరాజు, కలంపోటు మొదలయిన సుబ్రహ్మణ్యశాస్త్రిగారి నాటికలకు 'దెలుగునాట' సుప్రసిద్ధి వచ్చినది. నాయుద్దేశములో 'రాజరాజు' వీరి నాటకముల కన్నిటికిని కన్నాకు వంటి దని - అందులో నన్నయపాత్ర పోషణము అనన్య సాధారణమైన తీరులో శాస్త్రిగారు తీర్చినారు. రాజరాజుకడ, ఆత్మగౌరవము వీసమంతయినను చెడిపోకుండ నన్నయచే బలికించిన పాటవము సుబ్రహ్మణ్య శాస్త్రిగారికే చెల్లినది. ఇది యన్నమాట కాదు, ప్రతిపాత్రయును రాజరాజులో జీవన్మూర్తులై కనిపించును. ఇట్టి 'రాజరాజును' సాహిత్య సామ్రాట్టు విక్రమదేవవర్మ మహారాజు కృతిపొందుట యభినందనీయము. 'కలంపోటు' మొదలగు నాటికలు వీరివి యెన్నిసారులు చదవినను జదువవలయు ననిపించును.

నాటికారచనలో, కథారచనలో, పత్రికా సంపాదకతలో శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రిగారిది తెలుగు భూమిలో నొక ప్రత్యేకపీఠము. నాలుగుదశాబ్దులనుండి బహుగ్రంథ రచనలచే భారతీ సమారాధనము చేయు శాస్త్రిగారి వయస్సు నేటికి షష్టిలో నున్నను, భౌతిక పుష్టియు, భావపుష్టియు గలిగియుండిన ధన్యులు. వారికృతు లెన్నో మునుముందు మనము పఠింపగలము.


             ____________