పుట:AndhraRachaitaluVol1.djvu/540

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వీరు గ్రాంథికము వ్యావహారికము కూడ సహజమధురమైన శైలిలో వ్రాయగలవారు. శాస్త్రిగారు ముమ్మొదట వెలువరించిన చరిత్రగ్రంథము వీరపూజ. ఆగ్రంథ మందలి గ్రాంథికశైలీ సౌభాగ్యము చాల విలువగలది. శ్మశాన వాటిక, రక్షాబంధనము ఇత్యాదులగు వీరి నవలలు ప్రజానీకములో సువ్యాప్తములై యున్నవి. సుబ్రహ్మణ్య శాస్త్రిగారి వచనరచనలో జలువ చందనము వంటి దేదోయుండి హృదయమునకు రాసికొనుచుండును. సమాసముల గడబిడలు, అన్వయముల తిరుగుడులు మచ్చునకును రానిచ్చు స్వభావ మాయన కలమునకు లేదు. ఎంతసేపును, శాస్త్రిగారి చూపు సహజత్వముమీద. ఇది యటుండె,

1920 సం.నుండి శ్రీసుబ్రహ్మణ్య శాస్త్రిగారి సర్వసిద్ధాంతములకు బీఠమై 'ప్రబుద్ధాంధ్ర' వెలసినది. శాస్త్రిగారి సంపాదకత్వమున నీపత్రిక తొలియేడు ప్రతిపక్షమునకు వెలువడుచు, రెండవ యేటినుండి మాసపత్రికగా మాఱినది. ఆదిలో, ప్రబుద్ధాంధ్ర సగము సంస్కృతభాషా రచనలతోను, సగము తెలుగు రచనలతోను, వెలువడుట శాస్త్రిగారి యుభయభాషా వైదుష్యాభి మానములకు నిదర్శనము. అల్పకాలముననే 'ప్రబుద్ధాంధ్ర' తెలుగునేల మూలమూలలకు బ్రాకి పాఠకులనువలవైచి లాగినది. ఈఆకర్షణమునకు మహోత్తమ రచయితల వ్యాసములే కాక, శాస్త్రిగారి వ్యాఖ్యలు, విమర్శనములు హేతువులైనవి. వీరి కలమునకు జంకుగొంకులు లేవని తొలుత ననుకొంటిమి. గతానుగతిక ధర్మావలంబన మాయన బొత్తిగా సహింపలేరు. దానినిబట్టి హృదయములో నుండియో ఉండకో నూటికి దొంబదిమందిచే ద్రొక్కబడుచున్న సిద్ధాంతమును అమాంతముగా శాస్త్రిగారు గర్హింతురు. వట్టి గర్హణముతో సరిపెట్టక వాడిగల వ్రాతలో బెట్టి సుప్రచారము చేయుదురు. ఆయనలోనున్న యీగుణమునకు వారి 'ప్రబుద్ధాంధ్ర'