Jump to content

పుట:AndhraRachaitaluVol1.djvu/537

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వచ్చిన రచయిత. ఆంగలముకాని, వంగముకాని, మఱియొక వాజ్మయముకాని మర్యాదకైన జదివి చూచినవారు కారు. విశేషించి, 'హిందీ' ని చేరదీయరాదని చిరకాలమునుండి వారి వాదము. ఇంక, సుబ్రహ్మణ్యశాస్త్రిగారు కూడబెట్టుకొన్న సంపత్తి సంస్కృత సాహిత్య మొక్కటే. ఇటులు, విజాతీయమైన సంస్కారధోరణికి దూరముగా నిలచి, కృతకత్యగర్హితముకాని యాంధ్రత్వము నారాధించిన రచయిత రచన లెట్లుండును? అనుకరణములుకాని, అనువాదములుకాని చేయవలసిన ప్రారబ్ధము సుబ్రహ్మణ్యశాస్త్రిగారికి లేదు. యథార్థముగా ఆయన చూపులకు గనిపించిన వస్తువు, ఆయన చెవులకు వినిపించిన మాటలు మూటగట్టుకొని కథలలో బెట్టి కళ కట్టించును. ఉత్తమజాతి రచయిత చేసెడి పనియు, చేయగలిగిన పనియు నింతే! దీని వివరణము ముందు మనవిచేసెదను.

శ్రీపాదవారిది యనూచానమైన పండితవంశము. శ్రౌత స్మార్తములు, జ్యౌతిషము వీరి వంశ విద్యలు. సుబ్రహ్మణ్యశాస్త్రిగారి తండ్రిగారు యజ్వ. ఆయన కన్న మువ్వురు కుమారులలోను మన శాస్త్రిగారు మూడవవారు. వంశస్థు లందఱివలెనే వీరుకూడ శ్రౌత - స్మార్తములు, పరాయితము అధ్యయనము చేసినారు. జ్యౌతిషము స్కంధత్రయము పఠించినారు. అదికాక, వల్లూరిలో గుంటూరి సీతారామశాస్త్రిగారు, వేట్లపాలెములో దర్భా బైరాగిశాస్త్రిగారు, తమయింట, అన్నగారు శివరామ శిద్ధాంతి దీక్షితులుగారు గురువులుగా గావ్యపాఠము చేసిరి. పసినాటనే తెనుగులపై నభిరుచి యంకురించిన దగుటచే శాస్త్రిగారు, గురువుల చాటున నాంధ్రకృతులు చదువుటయు, ఏవో చిన్న చిన్న రచనలు చేయుటయు సాగించినారు. సరియైన యుపదేశ మున్నగాని కవితారచన చేయరాదని 1910 సం.లో సుబ్రహ్మణ్యశాస్త్రిగారికి నిశ్చయము కలిగినది. ఈ సునిశ్చయమే, పీఠికాపుర సంస్థాన కవులగు