పుట:AndhraRachaitaluVol1.djvu/513

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దువ్వూరి రామిరెడ్డి

1895 - 1947

రెడ్డి బిడ్డ. జన్మభూమి: నెల్లూరి మండలములోని పెమ్మారెడ్డి పాలెము. జననము: 9 నవంబరు 1895 సం. నిర్యాణము: 1947. రచనలు: 1. పానశాల 2. కృషీవలుడు 3. కుంభరాణా 4. వనకుమారి 5. సీతావనవాసము 6. నలజారమ్మ అగ్నిప్రవేశము. 7. పలితకేశము 8. Voice of the Read (ఆగ్లకవితాసంపుటము) మున్నగునవి.

అభినవాంధ్ర కవితారసాలశాఖ నధిరోహించి మధురగానము చేసిన కవిపుంస్కోకిలము దువ్వూరి రామిరెడ్డిగారిజీవితము స్మరణీయమైనది.

ఆయన కలిగిన రైతుబిడ్డ. ఆకలిమికి దోడు విజ్ఞానసంపత్తి. ఆసంపత్తికి సాయము తీయనైన కవితాధోరణి. ఈసమ్మేళనము చక్కనైనది. ఇది కవిసామాన్యమున కందని విందు. నెల్లూరిజిల్లాలోని పెమ్మారెడ్డి పాలెములో రామిరెడ్డిగారి పుట్టుక. అచటి పల్లెబ్రతుకుల మెలకువలో, వారికవిత యుట్టియలమీద నవనీతము మెనవి యార్ద్రమైనది. మెత్తని హృదయము; మెత్తని రచనాసంపత్తి. ఈభాగ్యముతో నాయన ఖండకావ్యము లెన్నో నంతరించెను. నాటికలు, కథానికలు, వ్యాసములు రచించెను. ఏమివ్రాసినను స్వాతంత్ర్య దీప్తి ప్రదర్శించెడి నేర్పు కలములో నున్నది. నిసర్గమధురమైన పదబంధము రామిరెడ్డిగారికి జన్మతోభవము. ఈసిద్ధివలన నీయన పూర్వ పద్ధతులను దాటి నడచుచున్నానని సాహసముతో వచించెను. ఈదిగువ పద్యములు పరికించునది:

చ. వనలతయైన నాకవిత పత్రపుటంబుల బూవురెమ్మలన్

దినదిన జృంభమాణమయి తేజరిలెన్ సహజ ప్రరోహవ

ర్ధన నియమాను సారముగ దల్లతయెన్నడు దోటమాలి పా

ణిని గనుగోని నవ్య్రరమణీత జిల్కు నపూర్వ పద్ధతిన్.