పుట:AndhraRachaitaluVol1.djvu/512

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రతాపరెడ్డిగారి, ఇత్యాదికమైన కవిత్వ మంతయు నొకయెత్తు, వారి 'ఆంధ్రుల సాంఘికచరిత్ర' గ్రంథ మొకయెత్తును. 1929 సంవత్సరమునుండియు రెడ్డిగారు తెలుగువారి సంఘమర్యాదలను, ఆయాకవుల గ్రంథముల ద్వారమును గుర్తించుకొనుచు వ్యాసరూపమున వెలువరించుచున్నారు. ఆ కృషియంతయు 1949 నాటికి పంటకు వచ్చి యేతద్‌గ్రంథరూపమున మనకు భుక్తమైనది. కాకతీయ సామ్రాజ్యము నాడు, రెడ్లపాలనమునాడు, విజయనగరరాజుల యేలుబడినాడు, మఱి వివిధప్రభుత్వములనాడు సాంఘికముగా దెలుగుల మర్యాదలు, నడతలు నెట్టివో యీ కూర్పున హృదయంగమఫక్కిని ప్రదర్శింప బడినవి. ఈ రచనవిషయమై రెడ్డిగారు కావించిన కావ్యపరిశీలనము, చరిత్ర పరిశోధనము గణనీయములైనవి. ఈకృతి చిరకాలస్థాయిగానుండి తెలుగువారి కుపయోగపడు ననుటలో విప్రతిపన్ను లుండరు. వీరి రచనయు నింపుగా సొంపుగా నడచినది. వారు వ్రాసినటులు-

" రాజుల రాజ్యాల చరిత్ర వ్రాయుట అంతకష్టము కాదు. కాని సాంఘికచరిత్రము వ్రాయుట కష్టము. దీని కాధారములు తక్కువ. తెనుగు సారస్వతము, శాసనములు, స్థానిక చరిత్రలు (కైఫీయత్తులు) విదేశీయులు చూచి వ్రాసిన వ్రాతలు, శిల్పములు, చిత్తరువులు, నాణెములు, సామెతలు, ఇతర వాజ్మయములలోని సూచనలు, దానపత్రములు, సుద్ధులు, జంగముకథలు, పాటలు, చాటువులు, పూర్వవస్తు సంచయములు (collections) - ఇవి సాంఘిక చరిత్రకు పనికి వచ్చు సాధనములు"

ఇంత సామగ్రితో శ్రమించి సంధానించిన రెడ్డిగారి సాంఘిక చరిత్రము నేటి సారస్వత కృతి సంభారమున కొక వెలుగు నిచ్చి, మెచ్చుకోలు పడయదగిన గ్రంథమై, వారి యశోలతకు మాఱాకు హత్తించు నదిగ నున్నది.

                                _________